సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి స్వీపింగ్ యంత్రాల పేరిట కోట్లాది రూపాయలను ఊడ్చేశారు. కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లపై దుమ్ము, ధూళిని తొలగించేందుకు కొనుగోలు చేసిన మెకానికల్ రోడ్ స్వీపర్ యంత్రాలలో భారీగా గోల్మాల్ జరిగినట్లు తెలుస్తున్నది. రెండే స్వీపింగ్ యంత్రాలను కొనగోలు చేసి.. ఏకంగా ఆరింటిని కొన్నట్లు రూ.కోటిన్నర ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు సమాచారం.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) పనిచేస్తుంది. ఈ ఎన్సీఏపీకి పీసీబీలోని సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే కాలుష్య నియంత్రణకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఖర్చు చేస్తారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ద్వారా ఎన్సీఏపీకి కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఏటా కోట్లాది రూపాయల నిధులు వస్తాయి.
తెలంగాణలో ఎన్సీఏపీ నిధులు ఖర్చు చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్, నల్లగొండ, సంగారెడ్డిని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గుర్తించింది. అందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రోడ్లను శుభ్రం చేసేందుకు మెకానికల్ రోడ్ స్వీపింగ్ యంత్రాలను కొనుగోలు చేసి పటాన్చెరు, జీడిమెట్ల ఐలా కమిషనర్లకు అప్పగించారు. కానీ ఎన్ని కొనుగోలు చేశారనే దానిపై పీసీబీ అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. వీటి కొనుగోళ్లలో భారీ మొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తున్నది. దాదాపు రూ.1.5 కోట్లకు పైగానే అవినీతి జరిగినట్లు స్పష్టమవుతున్నది.
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంద్వారా గాలి నాణ్యత, కాలుష్య నియంత్రణకు ఏం చేశారని ఇటీవల ఓ వ్యక్తి ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వాలని పీసీబీ అధికారులను కోరారు. మొత్తం ఆరు మిషన్లు కొనుగోలు చేసినట్లు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వాటిని పటాన్చెరు, జీడిమెట్ల ఐలా కమిషనర్లకు అప్పగించినట్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తి ఆరు యంత్రాల రిజిస్ట్రేషన్ నంబర్లు, వాహనాల వివరాలు, ఒక్కొక్కదానికి ఎంత ఖర్చు చేశారో చెప్పాలని మరోసారి దరఖాస్తు చేసుకున్నారు.
ఈసారి ఎన్సీఏపీ నిధుల ద్వారా కొనుగోలు చేసింది మొత్తం ఆరు యంత్రాలు కాదని.. కేవలం రెండు మాత్రమే కొనుగోలు చేశామని అందుకు ఒక్కొక్కదానికి రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల దాకా ఖర్చయిందని వెల్లడించారు. వాహనాల వివరాలు అడిగేసరికి యంత్రాల సంఖ్యను తగ్గించి చెప్పడంతో ఎన్సీఏపీ నిధుల్లో గోల్మాల్ బయటపడింది. కేవలం రెండు యంత్రాలు కొనుగోలు చేసి ఆరు కొన్నట్లు లెక్కల్లో చూపి రూ.కోటిన్నర స్వాహా చేసినట్లు తేటతెల్లమవుతున్నది.
మరో నాలుగు యంత్రాల పేరిట ఖర్చు చేసిన రూ.1.5 కోట్లు ఏమయ్యాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే కాకుండా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ద్వారా వచ్చిన నిధుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు అనేకసార్లు తేలింది. ఎన్సీఏపీ ద్వారా ఇప్పటి దాకా రూ. 623.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అందులో రూ.561 కోట్లు మాత్రమే ఖర్చయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన డబ్బంతా ఏమైందనే దానికి కాలుష్య నియంత్రణ మండలి అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు.