పర్యావరణానికి అత్యంత హాని చేసే ప్లాస్టిక్‌ను నిషేధించిన ప్రభుత్వం అమలు విషయంలోనూ అంతే పక్కాగా వ్యహరిస్తున్నది. సర్కారు ఆదేశాల మేరకు
క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పిస్తున్న అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీలపై దృష్టిపెట్టి.. కవర్ల వినియోగం ఎక్కువగా ఉండే దుకాణాలు, చికెన్ సెంటర్లు, కూరగాయల మార్కెట్లు, రైతుబజార్లు, కిరాణా షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వాడకంపై ఈ నెల ఒకటి నుంచి నిషేధం అమల్లోకి రాగా, ఇప్పటివరకు సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 5 మున్సిపాలిటీల్లో రెండున్నర టన్నులకుపైగా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. జరిమానాలూ విధించారు.
సూర్యాపేట, జూలై 29(నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని నిషేధించిన నేపథ్యంలో సూర్యా పేట జిల్లా వ్యాప్తంగా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలతోపాటు పట్టణాల్లో హానికరమైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు జరపకుండా సంబంధిత అధికారులు అవగాహన, హెచ్చరికల అనంతరం పెద్దఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో రెండున్నర టన్నులకు పైగా నిషేధిత ప్లాస్టిక్‌ను సీజ్ చేసి జరిమానాలు విధించారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం నుంచి కఠిన ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంకా కొన్నిచోట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సమాజంలో ప్రజారోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నది. మరోవైపు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే ప్రజల్లో చైతన్యం నింపుతున్నది. హరితహారం పేరిట కోట్లాది మొక్కలు నాటుతుండడగా చెట్లను నరికివేయడాన్ని నిషేధించింది. దీంతో ఇప్పటికే పచ్చదనం పెరుగుతూ వస్తుండగా ప్లాస్టిక్ పెనుభూతంగా మారింది. ఖాళీ స్థలాలు, డ్రైనేజీలు,పెంట కుప్పల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. వాటి నివారణకు 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వాడకాన్ని ప్రభు త్వం నిషేధించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది.
హానికర ప్లాస్టిక్‌పై నిషేధం
పర్యావరణానికి హానికరంగా మారిన ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకా రం ప్లాస్టిక్ పుల్లతో కూడిన ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ జెండాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీముల్లో వాడే ప్లాస్టిక్ పుల్లలు, స్వీట్ బాక్సులు, అహ్వాన పత్రికలు, సిగరెట్ ప్యాకెట్లపై ఉండే ర్యాపింగ్, ప్లాస్టిక్ స్ట్రిప్స్, బెల్లూన్లలో వాడే ప్లాస్టిక్ పుల్లలు, డెకరేషన్ కోసం వాడే థర్మకోల్‌తో పాటు ప్లాస్టిక్ ప్లేట్లు, సంచులు, కప్పులు, గ్లాసులు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు నిషేధించిన ప్లాస్టిక్ వస్తువుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈనెల 1 నుంచి ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లోకి రాగా 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలోని మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు. కొద్ది రోజులుగా ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణాలపై కిరాణం, చికెన్ షాపులు, కూరగాయాల మార్కెట్లు, రైతుబజార్లలో విస్తృ తంగా తనిఖీలు చేపడుతున్నారు.
రెండున్నర టన్నులకుపైగా సీజ్
జూలై 1న ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించిన ప్రభుత్వం పక్కాగా అమలు జరిపేలా ప్రణాళిక విడుదల చేసింది. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు రెండున్నర టన్నులకు పైనే ప్లాస్టిక్‌ను సీజ్ చేశారు. అయితే అధికార యంత్రాంగం గత నె26 నుంచే ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన మొదలు పెట్టింది. తదనంతరం తనిఖీలు చేస్తూ ప్లాస్టిక్ సీజ్ చేయడం, జరిమానాలు విధిస్తూ వస్తున్నారు. సూర్యాపేటలో 12 క్వింటాళ్లకు పైనే సీజ్ చేయగా కోదాడలో 8, తిరుమలగిరి, హుజూర్నగర్, నేరేడుచర్లల్లో కలిపి దాదాపు 5 క్వింటాళ్ల ప్లాస్టిక్ సీజ్ చేశారు. కాగా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు 75 మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న క్యారీ బ్యాగులు, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించారు. అంతేకాకుండా డిసెంబర్ 31 నాటికి 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మకాలు లేకుండా చూడడంతో పాటు తయారీని కూడా అరికట్టనున్నారు. వచ్చే నెల నుంచి ప్రతి నెలా మొదటి వారంలో ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేసిన ఉద్యోగులను సన్మానిస్తారు.
అవగాహన కల్పిస్తూనే కఠినంగా వ్యవహరిస్తున్నాం
ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాల కారణంగా వాటిని వినియోగించవద్దని పట్టణంలో వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇప్పటి వరకు సూర్యాపేట షాపుల్లో తనిఖీలు నిర్వహించి వ్యాపారులకు అవగాహన కల్పించడంతో పాటు 12 క్వింటాళ్లకు పైనే ప్లాస్టిక్ కవర్లు, ఇతర సామగ్రిని సీజ్ చేశాం. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపడుతున్నాం. ఎవరైనా ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు.
– బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, కమిషనర్, సూర్యాపేట