హాలియా, జూలై 28 : దళితబంధుతో సామాజిక విప్లవం సృష్టించనున్నట్లు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దళితబంధు పథకంలో భాగంగా సాగర్ నియోజకవర్గంలో 96 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.9.60 కోట్ల విలువైన వాహనాలు, యూనిట్లను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్, కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి హాలియాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పంపిణీ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఎడమ కాల్వకు నీటి విడుదల, దళిత బంధు లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ సంతోషకరంగా ఉందన్నారు. కుల, సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని, అయినా గత పాలకుల నిర్లక్ష్యంతో రాజ్యాంగం రచించి 75 ఏండ్లు గడిచినా సామాజిక రుగ్మతలు, కులాంతరాలు తొలగిపోలేదని పేర్కొన్నారు. ఆరోగ్యకర సమాజ స్థాపన కోసం సీఎం కేసీఆర్ దళితబంధును తీసుకొచ్చారని, ఈ పథకం అమలుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
దళితబంధు కింద పొందే రూ.10 లక్షలతో లబ్ధిదారులు తమకు నచ్చిన వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఏడాది నియోజకవర్గంలో 2వేల మందిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అనంతరం దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌నాయక్, ప్రత్యేకాధికారి రాజ్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, ఎంపీపీలు, జడ్పీటీసీలు, తాసీల్దార్లు, ఎంపీడీఓలు, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.