పటాన్చెరు రూరల్, ఫిబ్రవరి 7: ఇంద్రేశం మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. శనివారం రాత్రి ఇంద్రేశంలో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చేది మన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఇంద్రేశం చిన్నవాగు, పెద్దవాగు, రామేశ్వరంబండ వద్ద బ్రిడ్జి కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని గుర్తుచేశారు. కేసీఆర్ పటాన్చెరు, ఇంద్రేశం బల్దియాకు రూ.56 కోట్ల నిధులు మంజూరు చేస్తే, ఆ నిధులు వాడుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి వాపస్ తీసుకున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో వేసిన సీసీ రోడ్లే నేటికీ ఉన్నాయని, రెండేండ్లలో రేవంత్‌రెడ్డి వేసిందేమీ లేదని హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 కోట్లతో ఇంద్రేశం నుంచి రామేశ్వరంబండకు వెళ్లే రోడ్డు వేసిందన్నారు. కరోనా టైంలో ఇంద్రేశంలో మొదటి కేసు వెలుగు చూస్తే, ఆ సమయంలో ఆరోగ్య మంత్రిగా తాను ధైర్యంగా నిలబడి ట్రీట్మెంట్ చేయించిన విషయం గుర్తుచేశారు. పటాన్చెరులో మల్టీ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు చేసింది కేసీఆర్ అన్నారు. కేసీఆర్ పాలనలో పటాన్చెరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందన్నారు.
కార్మికులకు మూడు షిఫ్టుల్లో పనిదొరికిందన్నారు. అన్నివర్గాల అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను హరీశ్‌రావు కోరారు. ఇంద్రేశం మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెన్నవరం భూపాల్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, సత్యనారాయణ, ఆదర్శ్ రెడ్డి, దశరథ్ రెడ్డి, దేవానంద్, కొలన్ బాల్ రెడ్డి, గడీల శ్రీకాంత్ గౌడ్, వెంకట్‌రెడ్డి, సుధాకర్ రెడ్డి, సోమిరెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.