గుమ్మడిదల, ఫిబ్రవరి 7: గడిచిన రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఉచిత బస్సు స్కీమ్ ప్రవేశ పెట్టడం తప్పా చేసిందేమీ లేదని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. శనివారం గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం హైవే నుంచి గుమ్మడిదల వరకు భారీగా సంఖ్యలో కార్యకర్తలతో రోడ్‌షోలో పాల్గొన్నారు. అనంతరం గుమ్మడిదలలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, ఎన్నికల ఇన్చార్జి పట్నం మాణిక్యం, సీనియర్ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు.
అవ్వాతాతలకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు పింఛన్ రెట్టింపు ఇస్తానని, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, విద్యార్థులకు స్కాలర్ షిప్, ఫీజురీయింబర్‌మెంట్ అంటూ హామీలు ఇచ్చి ఇన్ని రోజులవుతున్నా అమలు చేయ డం లేదన్నారు. కేసీఆర్ పాలనలో రైతు బంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, రంజాన్‌తోఫా, బతుకమ్మ చీరలు, ఇం టింటా తాగునీరిచ్చి రాష్ట్ర ప్రజల బాధను తీర్చితే, నేడు కాంగ్రెస్ సర్కారు అబద్ధ్దాలతో గద్దెనెక్కి ఒక్క హామీ అమలు చేయడం లేదన్నారు.సీఎం రేవంత్‌రెడ్డికి విషయం లేదని.. బీఆర్ఎస్పై విషం చిమ్ముతున్నాడని విమర్శించారు.
గుమ్మడిదల మండలంలో నల్లవల్లి ప్యారానగర్లో డంపింగ్‌యార్డు రాకుండా ఉండాలంటే కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ సర్కారుకు తగిన గుణపాఠం చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సతీమణి యాదమ్మ, ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే తనయుడు విక్రమ్‌రెడ్డి, 22 వార్డుల అభ్యర్థులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.