చండూరు, జూలై 23 : గట్టుప్పల్.. చండూరు మండలంలోని ఈ గ్రామం మండల కేంద్రానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చేనేత కుటుంబాలు, గీత కార్మికులు, వ్యవసాయ, రోజువారీ కూలీలు ఎక్కువ. చాలా ఇండ్లది రెక్కల కష్టం మీదే గడిచే పరిస్థితి. ఎవరికైనా ప్రభుత్వ కార్యాలయంలో పని పడిందంటే రోజంతా వృథా అయ్యేది. ఆ పూట అధికారి అందుబాటులో లేకుంటే మరొక రోజు పని చెడగొట్టుకోవాల్సి వచ్చేది
ఇప్పుడు ఒక్క గట్టుప్పల్కే కాదు, చుట్టుపక్కల మరో 8 గ్రామాలకు ఆ బాధ తప్పింది. పరిపాలనా సౌలభ్యం కోసం స్వరాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటుచేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్‌ను మండలంగా గుర్తించింది. చండూరు మండలం నుంచి గట్టుప్పల్, కొండాపురం, తేరటుపల్లి, శేరిగూడెం, కమ్మగూడెం, మర్రిగూడ మండలం నుంచి నామాపురం, అంతంపేట, సోరాజుగూడ, మునుగోడులోని వెల్మకన్నెతో కలిపి గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేసింది. ఆ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
దాంతో గట్టుప్పల్ మండలం కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న స్థానికులు, చుట్టపక్కల గ్రామస్తుల కల నేరవేరినట్టయింది. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కృషి ఫలించింది. గట్టుప్పల్ మండలం ఏర్పాటుతో మొత్తం 9 గ్రామాల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. గట్టుప్పల్‌లో చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
స్వరాష్ట్రం, స్వపరిపాలన అనే నినాదంతో ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నంలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేందుకు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు, మండలాల పునర్విభజన చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా చం డూరు మండలానికి దూరంగా ఉండి ఇబ్బందు లు పడుతున్న జనం కోసం గట్టుప్పల్ పరిసర గ్రామాలను కలుపుతూ మండలంగా ఏర్పాటు చేయ బోతున్నారన్న వార్త గతంలో ప్రజల్లో సంతోషాన్ని నింపినది. కానీ కొన్ని అవాంతరాలతో ఆగిపోయినా మళ్ల్లీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చొరవతో ఈ ప్రాంత వాసుల కల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా గట్టుప్పల్ మండలంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో పరిసర గ్రామాలవారు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇన్నాండ్లకు కల నెరవేరబోతుందన్న ఆనందం వారి కండ్లలో కనబడుతున్నది.
మొత్తం 9 గ్రామాలతో ఏర్పాటు
కొత్తగా ఏర్పాటుగా కాబోతున్న గట్టుప్పల్ మండలంలో 9 గ్రామ పంచాయతీలను కలుపుతున్నారు. చండూరు మండలం నుంచి కొండాపురం, తేరటుపల్లి, గట్టుప్పల్, శేరిగూడెం, కమ్మగూడెం, మర్రిగూడ మండలం నుంచి నామాపురం, అంతంపేట, సోరాజుగూడ, మునుగోడు మండలం వెల్మకన్నెను కలిపి మండలంగా రూపుదిద్దుకోనున్నది.తుందన్న ఉత్సాహం వారి కండ్లలో కనబడుతున్నది. గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
చండూరు, జూలై 23 : గట్టుప్పల పంచాయతీని కొత్తగా మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో గ్రామంలో శనివారం సంబురాలు అంబరాన్నంటాయి. జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించి, పటాకులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తేరట్పలి,శేరిగూడెం, సర్పంచులు వీరమళ్ల శ్రీశైలం, పంకెర్ల పద్మానర్సింహ, ఎంపీటీసీ గొరిగె సత్తయ్య, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బండారు చంద్రయ్య, నాయకులు అవ్వారు శ్రీని వాస్, నామని జగన్నాథం, నామని గోపాల్, చెరుపల్లి ఆంజనేయులు,కర్నాటి అబ్బ య్య, జూలూరి పురుషోత్తంపాల్గొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసినం..
గట్టుప్పల్‌ను మండలంగా ఏర్పాటు చేస్తామని గత ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చి నందుకు ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి ప్రజల తరుపున కృతజ్ఞతలు. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గానికి సాగు నీరు అందివ్వడమే నా ప్రధాన లక్ష్యం. ఇందుకోసం డిండి ఎత్తిపోతల పథకం పూర్తికి అహర్నిశలు కృషిచేస్తున్నా.
– కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే మునుగోడు
ఏడేండ్ల నిరీక్షణకు తెరపడింది
ప్రభుత్వం గట్టుప్పల గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడం సంతోషకరం, ఏడేండ్ల నిరీక్షణకు నేడు తెరపడింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్న పనికైనా 20 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయ్యాల్సి ఉండేది. వర్షకాలంలో దూర ప్రయాణంతో నానా ఇబ్బందులు పడేవాళ్లం.
–భీమగాని మల్లేశ్ గట్టుప్పల
ఆనందంగా ఉంది
రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న నూతన మండలాల జాబితాలో మా గ్రామం ఉండడం సంతోషకరం. నేను సర్పంచ్‌గా ఉన్నప్పుడే మండల కేంద్రంగా రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉంది.
–ఇడెం రోజా, సర్పంచ్, గట్టుప్పుల