నల్లగొండ ప్రతినిధి, జూలై 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో తన జన్మదిన వేడుకలు జరుపడం సముచితం కాదంటూ యువనేత, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటిస్తూ.. పార్టీ శ్రేణులు, అభిమానులు కూడా వేడుకలకు బదులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేశారు. నియోజకవర్గాల వారీగా పలుచోట్ల రక్తదాన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. వృద్ధ్దాశ్రమాలు, అనాథాశ్రమాలు, ఇతర సంస్థల్లో అన్నదానం, దుప్పట్ల పంపిణీ వంటి కార్యక్రమాలకు సిద్ధమయ్యారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పండ్లు, పాలు పంపిణీ, కొన్ని ప్రాంతాల్లో మెడికల్ క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పార్టీ నేతలు కొందరు విద్య, వైద్య పరంగా అవసరమైన వారికి ఆర్థిక సాయం చేయాలని యోచిస్తున్నారు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, త్రిచక్ర వాహనాలను ఇచ్చేందుకు కొన్ని చోట్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటన్నింటితోపాటు జిల్లా అంతటా విస్తృతంగా మొక్కలు నాటేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు సిద్ధమయ్యారు. గత ఏడాది ముక్కోటి వృక్షార్చన పేరుతో కేటీఆర్ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సారీ మొక్కలు నాటడం ద్వారా కేటీఆర్కు బర్త్డే విషెస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు.