సూర్యాపేట, జూలై 23 (నమస్తే తెలంగాణ) : గత ప్రభుత్వాల కాలంలో ఏనాడూ రెండేండ్ల్లపాటు మూసీ ప్రాజెక్టు నిండి ఆయకట్టుకు నీళ్లిచ్చిన దాఖలాలు లేవు. స్వరాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఆరేండ్లుగా వరుసగా నీటిని అందిస్తూ వస్తున్నారు. 2016 నుంచి ఆయకట్టు పరిధిలోని 40వేల ఎకరాల సాగుకు డోకా లేకుం డా పోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వ చేయూత, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కృషితో 2020 నుంచి రెండు పంటలకు నీరు అందుతున్నది. ప్రాజెక్టు పూర్తి జలకళను సంతరించుకోవడంతో నీటి విడుదల ఖరారు చేశారు.
నాలుగు విడుతల్లో నీటి విడుదల
మూసీ ఆయకట్టుకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నాలుగు విడుతలుగా నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్ తెలిపారు. తొలి విడుతగా జూలై 25 నుంచి ఆగస్టు 22 వరకు 25 రోజుల పాటు నీటిని విడుదల చేస్తారు. రెండో విడుతలో సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 18 వరకు 15 రోజులు, మూడో విడుతలో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 18 వరకు రోజులు, నాలుగో విడుత నవంబర్ 2నుంచి 17 వరకు నీటిని విడుదల చేయాలని ఖరారు చేశారు. షెడ్యూల్ ఖరారైనప్పటికీ మంత్రి ఆదేశాలకనుగుణంగా పంటలు చేతికి వచ్చేవరకూ నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
7 గేట్ల ద్వారా నీటి విడుదల
సూర్యాపేట రూరల్ : వరుసగా కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి శనివారం 12,143.8 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. దీంతో ప్రాజెక్టు ఏడు గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి 25,278.6 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాల్వల ద్వారా వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 641.10 (3.47 టీఎంసీలు) అడుగులు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.