సూర్యాపేట, జూలై 21 (నమస్తే తెలంగాణ) : జీఎస్టీ కంటే ముందు వేర్వేరు వస్తువులకు వేర్వేరు ట్యాక్స్‌లు ఉండేవి. ఒక వేళ ఉన్నా తక్కువ శాతం ట్యాక్స్‌లు ఉండేవి. కానీ జీఎస్టీలో శ్లాబ్స్ తీసుకొచ్చి ఇష్టానుసారంగా పన్నులు విధిస్తున్నారు. ఇట్ల చాలా వాటిపై భారీగా ట్యాక్స్ పెరిగింది. ఇక ప్రతి ఇంట్లో అందరి బాగోగులను గృహిణి చూసుకుంటుంది. ఉదయం చాయ్ పెట్టినప్పటి నుంచి రాత్రి తిని పడుకునే వరకు ప్రతీది దగ్గరుండి నడిపిస్తుంటుంది. ఇంట్లో ఏం ఉన్నయి..? ఏం అవసరం..? ఎంత కొనాలి..? ఎంత వాడాలి..? దేనికెంత రేటు..? తదితర వాటిని బేరీజు వేస్తుంటుంది.
రాబడి, ఖర్చు అంతా లెక్కలు వేస్తుంటుంది. కానీ కొంత కాలంగా జీఎస్టీ అమలు, పెంపుదలతో వంటింట్లో గృహిణులకు కష్టాలు తప్పడంలేదు. గతంతో పోలిస్తే జీఎస్టీ వచ్చాక అధికంగా పన్నులు విధిస్తున్నారు. వంద రూపాయిలు ఉన్న కిలో మంచి నూనె ఇప్పుడు ఏకంగా రూ. 180దాకా పెరిగింది. చింతపండు, చక్కెర, పిండి, మసాల దినుసులు, సబ్బులు, షాంపులు, హెయిర్ ఆయిల్, బ్యూటీ క్రీమ్‌లు, పౌడర్లు తదితర వాటిపై ట్యాక్స్‌లు గుంజుతున్నారు. 99 నిత్యావసర వస్తువులపై 5 నుంచి 18 శాతం జీఎస్టీ విధించడం వల్ల సాధారణ జీవితం సాగించే 80శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలపై భారం పడుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 8,76,095 కుటుంబాలపై నెలకు రూ.21.91 కోట్లు, ఏడాదికి రూ.263 కోట్లు అదనపు భారం పడనుంది. జీఎస్టీ విధింపుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలంకరణ వస్తువులపైనా మోత
ఇక నిత్యం మహిళలు ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్‌పైనా జీఎస్టీ విధించారు. దుస్తులపై కూడా ట్యాక్స్ వేశారు. వెయ్యిలోపు అయితే 5శాతం, ఆపైన 12శాతం విధించారు. ఫుట్‌వేర్‌పై వరుసగా 5, 10, 18శాతం విధించారు. మహిళలు ఎక్కువగా ఇష్టపడే ఆభరణాలపై 1.8శాతం ఉన్న పన్నును 3శాతానికి పెంచారు. సెలూన్లలో వస్త్రధారణ, బ్యూటీకి సంబంధించి 18శాతం పన్ను విధించారు. అలంకరణ వస్తువులపై 28శాతం జీఎస్టీ వేశారు. ఇవేకాకుండా చెప్పులు, షూస్, చీరెలు, డ్రెస్సింగ్ ఐటెమ్స్, గాజులు, హ్యాండ్లూమ్ తదితర వాటిపైనా జీఎస్టీ బాదుతున్నారు.
ఖర్చులు తగ్గింపు
కేంద్ర ప్రభుత్వ తీరుతో గృహిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో దానిపై 30శాతం నుంచి 50శాతం దాకా రేట్లు పెరుగడంంతో ఏం కొనలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గృహిణులు తమ అవసరాలను తగ్గించుకుంటున్నారు. ఉన్న దాంట్లోనే సర్దుకుంటున్నారు. ధరలు పెరిగిపోవడంతో తమకున్న తక్కువ బడ్జెట్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లోనూ అవసరం ఉన్న మేరకే ఖర్చు పెడుతున్నారు. గతంలో 10 ప్యాకెట్లు తెస్తుండగా, ఇప్పుడు ఐదారుకే పరిమితం అవుతున్నారు. నాలుగు కిలోలు తెచ్చే బదులు రెండు కిలోలు మాత్రమే కొంటున్నారు. వెయ్యి రూపాయలకు రెండు డ్రెస్‌లు వస్తే.. ఇప్పుడు ఒక్కటే వస్తున్నది. బర్త్‌డే, పండుగలు మినహా పెద్దగా డ్రెస్‌లు కొనడం లేదు. ఉన్నవాటితోనే అడ్జెస్ట్ అవుతున్నారు. ఇక పేదలు బంగారం జోలికి వెళ్లడమే మానేశారు. రోజురోజుకు బంగారం రేట్లు పెరుగడం, దానికి జీఎస్టీ అదనంగా యాడ్ చేయడంతో అటువైపే వెళ్లలేని పరిస్థితి ఉంది.
ఉమ్మడి జిల్లాపై రూ.263 కోట్ల అదనపు భారం
నిత్యావసర వస్తువులపై విధించిన జీఎస్టీ వల్ల ఉమ్మడి జిల్లాపై ఏడాదికి రూ.263 కోట్లకు పైనే అదనపు భారం పడనుంది. పాలు, పాల ఉత్పత్తుల నుంచి ఉప్పు నుంచి పప్పుల దాకా 5 నుంచి 12 శాతం పన్ను వేశారు. ఇప్పటికే చింతపండు, చక్కెర, వంటనూనెలు తదితర వాటిపై జీఎస్టీతోపాటు సెస్సుల రూపంలో పన్నులు విధించి సామాన్యుడిపై భారం మోపారు. తృణ ధాన్యాలు, పప్పు దినుసులు, ఆటా పిండి, పాలు, పన్నీరు, బెల్లం, పంచదార, తేనె, బియ్యం, గోధుమలు, కూరగాయలు, బియ్యంపిండి లాంటి వాటిపై 5 నుంచి 12 శాతం పన్ను విధించారు. పెరుగు, బటర్‌మిల్క్ వంటి ప్రీప్యాక్డ్, ప్రీ లేబుల్డ్ పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ వేశారు.
నిత్యావసర సరుకులతో పాటు పాలు పాల ఉత్పత్తుల వాడకంతో ఒక్కో కుటుంబం నెలకు రూ.3వేల వరకు ఖర్చు చేస్తుండగా జీఎస్టీ విధింపుతో అదనంగా రూ.250 భారం పడుతున్నది. ఏడాదికి రూ.3వేల రూపాయల చొప్పున అధికంగా ఖర్చు అవనున్నది. ఈ లెక్కన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 8,76,095 కుటుంబాలపై రూ.263 కోట్ల అదనపు భారం పడనుంది. నల్లగొండ జిల్లాలోని 5,09,502 కుటుంబాలపై రూ.152.8 కోట్లు, సూర్యాపేట జిల్లాలోని 2,85,591 కుటుంబాలపై రూ.84.7 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 1,88,520 కుటుంబాలపై రూ.56.5 కోట్ల భారం పడనుంది.
గలత్ ట్యాక్స్‌పై పబ్లిక్ ఫైర్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు, టీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
సూర్యాపేట, జూలై 21 (నమస్తే తెలంగాణ) : పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడంపై జిల్లాలోని రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రెండో రోజు గురువారం జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. జీఎస్టీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. పలు చోట్ల ర్యాలీలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని కోదాడలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కేంద్రం తీరును తప్పుబట్టారు. చివ్వెంల, ఆత్మకూర్.ఎస్, సూర్యాపేట, నకిరేకల్, కట్టంగూరు, చిట్యాలలో నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అవసరాలను తగ్గించుకుంటున్నం
అలంకరణ వస్తువులు, దుస్తులు, వంటింటి సామాన్లు నిత్యం ఇంట్లో ఉపయోగించే వాటిపై జీఎస్టీ పెంచడం మూర్ఖపు చర్య. సామాన్య గృహిణులకు అవసరమయ్యే వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం సరైంది కాదు. ఇప్పటికే వివిధ వస్తువులపై విధించిన జీఎస్టీతో మధ్య తరగతి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. పెరిగిన ధరలతో ఇప్పుడు ఖర్చులు తగ్గించుకుంటున్నం. అవసరం ఉన్న మేరకే కొంటున్నం.
– జెట్ట సరిత, గృహిణి, వీరవెల్లి, భువనగిరి మండలం
సామాన్య ప్రజలు ఏం తినాలి
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. కూరగాయలు, పప్పులు రేట్లు చుక్కలనంటుతున్నాయి. ఇప్పుడు రోజూ తినే పదార్థాలైన పాలు, పెరుగుపై జీఎస్టీ విధించడం సరికాదు. దీని వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది. ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచితే మాలాంటోళ్లు ఎలా తినేది? ఎలా బతికేది? జీఎస్టీని రద్దు చేయాల్సిందే.
– గుండ్లపల్లి నవనీత, గృహిణి, పెద్దకందుకూరు, యాదగిరిగుట్ట మండలం
అడ్డగోలుగా పన్నులు పెంచుతున్నరు
కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పన్నులను పెంచుతున్నది. ఏ వస్తువు కొందామన్నా పన్నుల భారం మీద పడుతున్నది. ఇప్పుడున్న పరిస్థితిలో నిత్యావసరాలపై జీఎస్టీ విధించడం దారుణం. పన్నుల భారంతో పేదలు మరింతగా దిగజారి పోతుండగా బడా పారిశ్రామిక వేత్తలు అందలం ఎక్కుతున్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ ఉత్పత్తులపై జీఎస్టీ వేయడం సిగ్గుచేటు. పశువుల దాణాపై కూడా జీఎస్టీని విధిస్తున్నారు. మోదీ పాలన పోవాలని కోరుకుంటున్నా.
-కన్నెబోయిన ఉమారాణి, గృహిణి ,కొండగడప, మోత్కూరు మండలం
పేదలకు కష్టమే..
అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. మోదీ సర్కారు వచ్చిన తర్వాత కూరగాయలు, పప్పులు, నూనెల ధరలు పెరిగిపోయినయి. ఏం కొనేటట్టు లేదు. ఇప్పుడు పాలపై ధరలు కూడా పెరిగినయి..గిట్లయితే ఎట్లా.. సామాన్యులు బతకాలా వద్దా.. మోదీ సర్కారు తీరు మార్చుకోవాలి.
-జాల జంగమ్మ, కొండమల్లేపల్లి
మోదీకి మహిళలపై కక్ష ఎందుకో..
పాలు, పాల ఉత్పతులు, గ్యాస్, నూనెలు, పప్పుల వంటి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తీసుకొచ్చిన మోదీకి మహిళపై కక్ష ఎందుకో. మోదీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం దేశంలోని మహిళలపైనే పడుతున్నది. ఇక ఖర్చులు భరించడం పేదలు, మధ్య తరగతి ప్రజల వల్ల కాదు. కేంద్రం ప్రభుత్వంపై ప్రజలు భగ్గుమంటున్నారు.
– పానుగంటి అరుణ, పాత బస్టాండ్, భువనగిరి
ఖర్చులు తగ్గించుకుంటున్నాం..
నిత్యావసర ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు జీఎస్టీ పేరుతో పన్నులు విధించడం వల్ల ఏ వస్తువు కూడా కొనలేకున్నాం. ఏడేండ్ల కింద లీటరు పాలు 50 రూపాయలు ఉండగా ఇప్పుడు 70 రూపాయలు అయ్యింది. పాలు, పెరుగు లేకుంటే పిల్లలు ఇబ్బంది పడుతారు. ఖర్చు తగ్గించుకొని వాడాల్సి వస్తున్నది. మధ్య తరగతి కుటుంబాలపై భారం మోపేలా మోదీ సర్కారు ధరలు పెంచడం మంచిదికాదు.
-ఏలె అమృత, నెమ్మికల్, ఆత్మకూర్.ఎస్