నందికొండ, జూలై 21 : కృష్ణా ఎగువ పరీవాహక ప్రాజెక్టులు జురాల, అల్మట్టి, తుంగభద్ర నుంచి శ్రీశైలలానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నది. శ్రీశైలం 885 అడుగులకు 880 అడుగులు చేరుకొని 188 టీఎంసీ నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాల ద్వారా దిగువననున్న నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 55,889 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది.
పది రోజుల్లో సాగర్ రిజర్వాయర్ 528.30 నుంచి 534.60 అడుగులకు చేరుకొని 6 అడుగుల మేరకు నీటి మట్టం పెరిగింది. కృష్ణా ఎగువ పరీవాహక ప్రాజెక్టుల్లో జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుతుండడంతో, ఈ యేడాది నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం ప్రస్తుతం 534 అడుగులు వద్ద 177 టీఎంసీల నీరు ఉంది.
గతేడాది ఇదే సమయానికి 533 అడుగుల వద్ద 175 టీఎంసీలనీరు నిల్వ ఉంది. ఆశాజకనంగా ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో ఎడమ కాల్వ కింద వానకాలం సాగు చేస్తున్న రైతాంగానికి పంటలకు నీరు అందించడానికి మార్గం సులభతరం కానున్నది. శ్రీశైలం జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండడంతో, నాగార్జునసాగర్ ఆయకట్టు కింద బోర్లు, వర్షాభావ పరిస్థితులపై వరి, పత్తి సాగు చేస్తున్న రైతుల్లో పంట సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి.
గతేడాది ఆగస్టులో నాగార్జునసాగర్‌కు డ్యామ్‌లోకి ఇన్‌ఫ్లో వచ్చి చేరతుండగానే ఆయకట్టు కింద సాగు చేసే రైతుల కోసం ఆగస్టు 5న ఎడమకాల్వకు నీటివిడుదల చేసి ఆన్ అండ్ ఆఫ్ పద్ధ్దతిలో రెండు పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నీరు అందించింది. ఈ సారి కూడా ముందస్తుగానే ఎడమ కాల్వకు నీటి విడుదల చేయడానికి అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.