యాదాద్రి, జూలై 16 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. తిరువారాధన, బాలబోగం, స్వామివారికి నిజాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు తులసి సహస్రనామార్చనలు, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, వెండి మొక్కు జోడు సేవలు అర్చకులు ఘనంగా నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్ చెంత కొలువైన క్షేత్రపాలక ఆంజనేయ స్వామికి నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. స్వయంభువులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్టలో స్వామివారి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ.14,69,457 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు.
రామలింగేశ్వరాలయంలో వరుణ శాంతి హోమం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబంధ అలయమైన పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరాలయంలో ప్రధాన పురోహితులు, ప్రధానార్చకులు వరుణశాంతి హోమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భారీగా వర్షాలు కరుస్తున్న నేపథ్యంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ సూచనల మేరకు భారీ వర్షాలు తగ్గుముఖం పట్టి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆలయంలో హోమం, అభిషేకం, జపాలు చేపట్టారు. శివాలయం ప్రాకార మండపంలో వరుణశాంతి హోమం, ఇంద్రగాయత్రి జపం జరిపి పూర్ణాహుతి చేపట్టారు. కార్యక్రమంలో శివాలయ ప్రధానార్చకులు నర్సింహరాములు శర్మ, ప్రధాన పురోహితులు గౌరిభట్ల సత్యనారాయణశర్మ, ఆలయ ఏఈఓ దోర్భల భాస్కర్‌శర్మ పాల్గొన్నారు.
రూ.19 కోట్లు.. 6కిలోల బంగారం
యాదాద్రిలో స్వర్ణతాపడానికి జమైన విరాళం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి విరాళాల వెల్లువ కొనసాగుతున్నది. శనివారం నాటికి స్వామివారి స్వర్ణతాపడానికి రూ.19.38కోట్ల నగదు, 6కిలోల 617 గ్రాముల బంగారం బ్యాంకు ఖాతాలో జమైనట్లు ఆలయాధికారులు తెలిపారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి దివ్య విమాన గోపురం స్వర్ణతాపడానికి 125కిలోల బంగారాన్ని వినియోగించనున్నారు. ఇందుకోసం సుమారు రూ.65కోట్లు సేకరించాల్సి ఉంది. ఈ గొప్ప కార్యంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని 2021 అక్టోబర్ 19న యాదాద్రిలో సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అంతకుముందు 2021, సెప్టెంబర్ 25వ తేదీ నుంచే ఆలయాధికారులు విరాళాలు సేకరించే పనిలో పడ్డారు. నాటి నుంచి జూలై 15వ తేదీ వరకు రూ. 19,38,17,871 నగదు, 6 కిలోల 617 గ్రాములు మిశ్రమ బంగారం స్వామివారికి ఖాతాలో జమైనట్లు ఒక ప్రకటనలో తెలిపారు.