ఈస్ట్‌మన్ కలర్ సినిమా వెండితెరపై వెలిగిపోవడం ఆరంభమయ్యాక.. రంగస్థలం వెలవెలబోవడం మొదలైంది. సోషల్ మీడియా చేతిలోకొచ్చాక చిన్న సినిమాలదీ అదే దుస్థితి. అగ్ర హీరోల సినిమా ప్రదర్శనకు మాత్రమే హౌజ్‌ఫుల్ బోర్డులు కనిపించే కాలంలో నాటక ప్రదర్శనకూ హౌజ్‌ఫుల్ బోర్డులు పెడుతున్నారంటే నమ్మశక్యం కాదు. నలుగురితో చప్పట్లు కొట్టించుకోవాలనే కోరికతో పాఠశాలలో వేషం కట్టిన విద్యార్థి, ఎందరు ఎన్ని మాటలన్నా రంగస్థల విద్యనే ఎంచుకున్నాడు. నాటకాల్లో ట్రెండ్ సెట్టర్‌గా ఎదిగాడు. పవర్ఫుల్ సందేశాలతో హౌజ్‌ఫుల్ నాటకాలు ప్రదర్శిస్తున్న నాటక రచయిత, ప్రయోక్త, దర్శకుడు షేక్ జాన్ బషీర్ రంగస్థల ప్రయాణం గుర్తుచేసుకున్నారిలా…

మా అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు. మా కుటుంబానికి రంగస్థలానికి సంబంధమే లేదు. నా చిన్నతనంలో గ్రామంలో ప్రదర్శించే పౌరాణిక నాటికలు చూసేందుకు వెళ్లాను. నాటిక చివర్లో జనమంతా ప్రదర్శన బాగుందంటూ చప్పట్లు కొడుతుంటే నాకు కూడా ఏదో ఒకరోజు ఇలానే చప్పట్లు కొట్టించుకోవాలనే కోరిక పుట్టింది. పాఠశాలలో చిన్న నాటికల్లో వేషం కట్టాను. భక్త ప్రహ్లాదుడిగా నా తొలి ప్రదర్శన జీవితంలో మరిచిపోలేను. రంగస్థల నటుడిగా రాణించాలనే ఆలోచన ఉన్న నాకు డిగ్రీ చదివేప్పుడు థియేటర్ ఆర్ట్స్ కోర్స్ గురించి తెలిసింది.
నాటకాలంటే ఇష్టపడే నాపై వీధినాటికలతో ప్రభుత్వాలను ప్రశ్నించిన ప్రఖ్యాత కళాకారుడు సఫ్దర్ హష్మీ ప్రభావం పడింది. ఆయన వేసిన నాటికల గురించి వెతికి మరీ తెలుసుకున్నాను. ఆయన ఆలోచనలు నన్నెంతగానో ఆకర్షించాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ పెర్ఫామింగ్ ఆర్ట్స్ (ఎంపీఏ) చదవాలనే కోరికతో పీజీ ఎంట్రెన్స్ రాశాను. ఆ కోర్స్‌లో సీట్ సాధించాను. చేరిన కొత్తలో ‘అసలు ఆ కోర్స్ చదివితే బతుకుదెరువు ఉండదని, దాన్ని ఎందుకు ఎంచుకున్నావంటూ’ అందరూ తిట్టారు.
ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని ఎంబీఏ చేయమన్నారు. వాళ్లు ఎన్ని చెప్పినా నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఎవరేమనుకున్నా పట్టించుకోలేదు. యూనివర్సీటీ థియేటర్ రిపెర్టరీ ఆధ్వర్యంలో మా బృందం మహిళా సాధికారత, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు వీధి నాటికలు వేశాం. ఎంపీఏ విజయవంతంగా పూర్తి చేశాను. గోల్డ్ మెడల్ సాధించాను. అప్పుడు నన్ను తిట్టినవాళ్లూ మెచ్చుకున్నారు. థియేటర్ ఆర్ట్స్‌లో పీహెచ్డీ పూర్తి చేశాను. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. దాదాపు 400 మందికి కళాకారులకు రంగస్థల శిక్షణనిచ్చాను.

రంగస్థల నాటికలకు ఆదరణ కరువైన కాలంలో నన్ను నేను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నా. జనం చూపు నాటికలవైపు మళ్లించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఎలాంటి నాటికలు వేస్తే జనాలు ఆదరిస్తారని కసరత్తు మొదలుపెట్టాను. స్టూడియో బీ పేరుతో ఒక రిపర్టీని ఏర్పాటు చేశాను. రంగస్థల కళాకారులతో సామాజిక, ఆర్థిక అసమానతలు, మహిళా సాధికారత, సమాజంలో నిత్యం జరుగుతున్న సంఘటనలు ఆధారంగా నాటికలు రూపొందించాం. అనేక పట్టణాల్లో తిరిగి వాటిని ప్రదర్శిస్తున్నాం. ఇప్పటివరకు ప్రదర్శించిన నాటకాల్లో విశ్వవిఖ్యాత ముక్కు, రంగభూమి, మహా నిర్వాణం, న్యూ బాంబే టైలర్స్, అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి నాటికలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఈ నాటికల ప్రదర్శనకు హౌజ్‌ఫుల్ బోర్డులు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన ఈ రంగస్థల నాటికలకు పూర్వ వైభవం తేవాలన్నదే నా తపన. తీరిక సమయాల్లో స్క్రిప్ట్ రాసుకుంటూ, సందర్భాలను బట్టి నాటికలు ప్రదర్శిస్తున్నాం. మా బృందం ఇప్పటివరకు దక్షిణ కొరియా, నార్వే, స్వీడన్ దేశాలతోపాటు మనదేశంలోని అనేక రాష్ర్టాల్లో 70కిపైగా ప్రదర్శనలు ఇచ్చింది. కేంద్రం తెచ్చిన మూడు నల్లచట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వాళ్ల మధ్యే ‘కార్పొరేట్ కానూన్’ నాటిక ప్రదర్శించాం. ఆ ప్రదర్శనను దాదాపు 40వేల మంది తిలకించారు.
కళాకారుడిగా నాటికలకు ప్రాణం పోస్తున్నందుకు గాను 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించింది. 2021లో తెలుగు యూనివర్సిటీ జేవీఎల్ నర్సింహరావు యువ పురస్కారం ప్రదానం చేసింది. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగిస్తాను. రంగస్థలం వేదికగా.. సమాజ నిర్మాణానికి నావంతు కృషి చేస్తాను.
– రాజు