జిన్నారం, ఫిబ్రవరి 7: రేవంత్‌రెడ్డి ముమ్మాటికి తెలంగాణ ద్రోహి అని.. నోటుకు ఓటు కేసులో డబ్బులతో రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుబడిన నీచ చరిత్ర రేవంత్‌రెడ్డిది అని, గోడలకు సున్నాలు వేసుకునే రేవంత్‌రెడ్డి.. పెయింటర్ నుంచి పొలిటీషియన్ దాకా నీబతుకంతా అవినీతి మయమని, ఆనాడే రేవంత్‌రెడ్డికి బేడీలు వేసి ఊరేగించాల్సిందని, కేసీఆర్ మంచోడు కాబట్టే నిన్ను వదిలపెట్టాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం, జిన్నారం మున్సిపల్ పరిధుల్లో శనివారం హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహించారు.
జిన్నారంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల క్లిప్‌లను ప్రజలకు చూపారు. ఈ సందర్భంగా జిన్నారం, గడ్డపోతారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తే, ప్రస్తుత సీఎం ఈ పథకాల్లో కోత పెడుతున్నారని ఆరోపించారు. నీతి, నిజాయితీ, పద్ధ్దతి లేకుండా వయస్సులో పెద్దవాడైన కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం రేవంత్‌రెడ్డికి తగదన్నారు. నీకు, నీ గాడిదలకు ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ మనోడు కాదని రేవంత్‌రెడ్డి అనటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ కోసం ఉద్యమాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు కాళ్ల దగ్గర రేవంత్‌రెడ్డి ఉన్నాడని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. రేవంత్‌రెడ్డి గురువు చంద్రబాబుకు గురుదక్షణ చెల్లించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ నీళ్లను ఒడిసి పడితే రేవంత్‌రెడ్డి ఆంధ్రకు నీళ్లును పంపే కుట్ర చేస్తున్నారన్నారు. పథకాలపై ప్రశ్నిస్తే తమపై లేని పోని కేసులు పెడుతున్నాడని, ఎన్ని కేసులు పెట్టినా చెప్పిన హామీలను అమలు చేసే దాకా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. బీజేపీ ఏం చేసిందని ప్రజలను ఓట్లు అడుగుతున్నారో అర్ధమైతలే. ఓటును మోరిలో వేసినా, బీజేపీకి వేసి ఒక్కటే అన్నారు.
బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించాలని, అప్పుడే సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయవచ్చన్నారు. గడ్డపోతారంలో బస్తీ దవాఖానను ఏ ర్పాటు చేయించేలా తాము చర్యలు తీసుకుంటామన్నారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిన్నారంలోని సర్వేనంబర్ ఒకటి రైతులకు న్యా యం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి, ఇన్చార్జి పాల సాయిరాం, మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు గూడెం మధుసూధన్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సతీమణి యాదమ్మ, నాయకులు ప్రకాశ్‌చారి, రాజేశ్, పాండురంగారెడ్డి, విక్రంరెడ్డి, కల్పన, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.