వానకాలం ఆరంభంలో దోమల వల్ల వేలాది మంది సీజనల్ జ్వరాల బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోతున్న పరిస్థితి. అనాఫిలిస్, క్యూలెక్స్, ఎడిస్, మాన్సోనియా, ఆర్మిజరిస్ అనే ఐదు రకాల దోమల వల్లే ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారు. ఆర్మిజరిస్ దోమల వల్ల వచ్చే జబ్బులు 90శాతం ప్రాణాంతకం కావు. కానీ.. మిగిలిన వాటి వల్ల మనిషి ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. ఈ దోమలు కుట్టడం వల్ల మలేరియా, పైలేరియా, డెంగీ, చికున్‌గున్యా, చిన్న పిల్లలకు మెదడువాపు వంటి అంటువ్యాధులు వస్తాయి. ఈ దోమలు ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉండే నీటిలో గుడ్లు పెడుతాయి. ఆ గుడ్లు 8 రోజుల్లో పిల్లలుగా మారుతాయి. నీరు నిల్వ లేకుండా చూసుకుంటే దోమల వ్యాప్తిని అరికట్టవచ్చు.
సాధారణ జ్వరం, జలుబు..
సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిముల వల్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. గాలి, నీటి ద్వారా మానవ శరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి. వైరస్ రకాన్ని బట్టి జ్వరం ఉంటుంది. వైరల్ జ్వరం మూడు నుంచి వారం రోజుల వరకు ఉంటుంది.
రుతుపవనాల రాకతో వర్షాలు జోరందుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురువడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే.. రోజుల తరబడి నీరు నిల్వ ఉండే చోట దోమలు, సూక్ష్మక్రిములు వృద్ధి చెంది వ్యాధులకు కారకాలుగా మారే అవకాశముంది. ప్రధానంగా దోమల వ్యాప్తితో ఐదు రకాల వ్యాధులతోపాటు వైరల్ ఫీవర్స్ విజృంభిస్తాయి. ఈ క్రమంలో వానకాలంలో అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధులు, లక్షణాలపై అవగాహన కలిగి ఉండి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే వాటి బారి నుంచి సులువుగా బయటపడవచ్చని పేర్కొంటున్నారు.
టైఫాయిడ్.. : వర్షాకాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. ఇది సాల్మొనెల్లా టైపీ బాక్టీరియా వల్ల వస్తుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది.
చికున్ గున్యా.. : చికున్ గున్యా ఎడిస్ అనే దోమ వల్ల వస్తుంది. తలనొప్పి, వాంతులు, వికారంతోపాటు హఠాత్తుగా జ్వరం రావడం దీని లక్షణాలు. కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. జ్వరం తగ్గినా ఈ నొప్పులు ఎక్కువ కాలం ఉంటాయి. చికున్ గున్యా సోకితే మొదటి రెండు, మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది. ఎడిస్ దోమలు ఇంటి పరిసర ప్రాంతాల్లో పడవేసిన పాత్రలు, ప్లాస్టిక్ వస్తువులు, పూల కుండీలు, డ్రమ్ములు, టైర్లు, ఎయిర్ కండిషన్లు, చెట్టుతొర్రల్లో ఎక్కువగా ఉంటాయి.
మలేరియా.. : రోగగ్రస్తమైన ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా సోకుతుంది. మలేరియా రోగిని దోమ కుట్టి రక్తం పీల్చినప్పుడు రోగకారకమైన పరాన్న జీవి దాని కడుపులోకి ప్రవేశించి పెరుగుతుంది. ఆ దోమ మరో వ్యక్తిని కుట్టినప్పుడు పరాన్నజీవి ఆ వ్యక్తి రక్తంలోకి చేరి వ్యాధి సంక్రమింపజేస్తుంది. మలేరియా నాలుగు రకాలుగా ఉంటుంది. ప్లాస్మోడియం వివక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం ఓవలే. చివరి రెండు రకాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్మోడియం వివక్స్ వ్యాప్తి చెందింది. చలితో హఠాత్తుగా జ్వరం రావడం, 15 నిమిషాల నుంచి గంట వరకు శరీర ఉష్ణోగ్రత 41డిగ్రీల సెంటిగ్రేడ్ (106 డిగ్రీల ఫారన్‌హీట్) వరకు పెరుగుతూ ఉంటుంది. రోగికి చాలా వేడిగా, బలహీనంగా తీవ్రమైన తలనొప్పి రావడం, జ్వరం తగ్గిన తర్వాత బాగా చెమటలు వస్తాయి. ప్రతి మూడు, నాలుగు గంటలకోసారి లేదా మూడు నుంచి నాలుగు రోజులకోసారి జ్వరం వస్తూ పోతుంది.
డెంగ్యూ.. : పగలు కుట్టే ఎడిస్ అనే దోమల ద్వారా డెంగ్యూ వస్తుంది. ఇది సాధారణ వైరస్ జ్వరం. వైరల్ ఫీవర్ మాదిరిగా అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. తగ్గినట్లు అనిపించి వారం పది రోజుల్లో మళ్లీ తిరగబడుతుంది. తలనొప్పి, ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం కలుగడం వల్ల కాళ్లు, చేతులు, ముఖం, వీపు, ఉదర భాగాల చర్మంపై ఎర్రగా కందినట్లు చిన్న చిన్న మొటిమలు కనిపిస్తాయి. కండ్ల నొప్పి, శరీరంపై చిన్న చిన్న దద్దుర్లు, జ్వరం లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్ మనిషి రక్తంలోని తెల్ల రక్త కణాలను తింటుంది. దీంతో రక్తకణాలు తగ్గి ప్రాణాలకు ప్రమాదం కలుగుతుంది.
హెపటైటీస్ ఏ.. : వర్షాకాలంలో హెపటైటిస్ ఏ (కామెర్లు) వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది కాలేయ కణాల్లో సంక్రమణ వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి కారక సూక్ష్మక్రిములు కలుషితమైన ఆహార పదార్థాలు, తాగునీటిలో కలిసి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాలేయ వ్యాధి కారణంగా రక్తంలో బిలిరుబిన్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా శరీర భాగాలు పసుపు రంగులోకి మారుతాయి.
పైలేరియా.. : పైలేరియా (బోధకాలు) వ్యాధి క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాప్తి చెంది ఎవరికైనా సోకే ప్రమాదముంటుంది. తరుచూ వచ్చే జ్వరం, చంకలు, గజ్జల్లో బిల్లలు కట్టడం, వెదురు పాముతో మొదలై క్రమేణా అవయవాల వాపునకు దారి తీస్తుంది. ప్రత్యేకించి కాళ్లు, చెతులు, స్థనాలు, వరబీజం, బుడ్డ, జ్ఞానేంద్రియాలు పాడవ్వడం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. ఈ వ్యాధి ఎలాంటి పరిణామాలకు దారి తీయనప్పటికీ వ్యాధిగ్రస్తుల మానసిక వ్యథ, శారీరక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధికారక క్రిమి శరీరంలోకి ప్రవేశించిన కొన్ని సంవత్సరాలకు లక్షణాలు బయటపడుతాయి. దీని నియంత్రణకు సంవత్సరానికి ఒక మోతాదు డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి. జిల్లాలో 6,835 మంది బోధకాల వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అందులో సూర్యాపేట జిల్లాలోనే అధికం.
మెదడువాపు.. : మెదడువాపు వ్యాధి క్యూలెక్స్ అనే దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఎక్కువగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో నాలుగు నుంచి 12సంవత్సరాల్లోపు పిల్లల్లో వస్తుంది. ఈ వ్యాధి చిన్నపిల్లలకు ప్రాణాంతకం. శాశ్వత అంగవైకల్యం వచ్చే అవకాశముంది. పంట పొలాల్లోని నీటి నిల్వల్లో ఈ దోమ వ్యాప్తి చెందుతుంది. మిర్యాలగూడ డివిజన్లోని అన్ని మండలాలతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని అలేరు, భువనగిరి, గుండాల, ఆత్మకూర్(ఎం), మోత్కూరు మండలాల్లో ఈ కేసులు నమోదయ్యే అవకాశముందని వైద్యాధికారులు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు చిన్నారులకు టీకాలు వేయించాలి. పందులు, పక్షులను నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలి.
సీజనల్ వ్యాధుల నివారణకు జాగ్రత్తలు..
అప్రమత్తతే ప్రధానం..
వర్షాకాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షణ పొందవచ్చు. ఇండ్ల ముందు వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జన సమూహం ఎక్కువగా ఉన్న చోట తిరుగకూడదు. వర్షంలో తడవకుండా చూసుకోవాలి. మాస్క్ ధరిస్తే చాలా వరకు వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. చేతులు తరచూ సబ్బుతో కడుక్కోవాలి. సకల వ్యాధులకు మూలమైన దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలు పెరుగకుండా ఇంటి పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉండే నీటి ప్రదేశాలను తొలగించాలి. దోమలతో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కలిపిస్తున్నాం. జ్వరాలు వచ్చినట్లు గుర్తిస్తే వెంటనే ఆయా గ్రామాల్లో రక్త నమూనాను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నాం.
– డాక్టర్ అన్నీమళ్ల ,కొండల్రావు, నల్లగొండ ,డీఎంహెచ్ఓ