మిర్యాలగూడ, జూలై 10 : పెండ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సహజీవనం చేసి పలుమార్లు లైంగికదాడి చేశాడని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి సీసీఎస్ ఎస్ఐ ధరావత్ విజయ్‌పై ఓ యువతి మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లికి చెందిన ధరావత్ విజయ్ ఎస్ఐగా పని చేస్తున్నాడు. పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న మిర్యాలగూడ మండలంలోని ఓ తండాకు చెందిన యువతితో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం సాగించాడు. ఈ క్రమంలోనే విజయ్ మరో యువతిని పెండ్లి చేసుకోగా సంతానం కలిగింది.
అయినప్పటికీ తనతోనే ఉండాలని వివాహం చేసుకోవద్దని చెబుతూ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో ఆమెతో కలిసి ఉంటున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సదరు యువతి ఈ నెల 8న మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విజయ్‌పై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు లైంగికదాడి, మోసగించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మండవ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. విషయం బయటకు పొక్కకుండా చూడాలని బాధితురాలు కోరడంతో పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టారు. ఆదివారం విషయం బయటకు పొక్కడంతో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఎస్ఐ విజయ్ను సస్పెన్షన్ చేశారు.