యాదాద్రి, జూలై 10 : తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో లక్ష పుష్పార్చన పూజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో విశేష పూజలను శాస్ర్తోక్తంగా జరిపించారు. విశేష పూజా కైంకర్యాలను దేవస్థాన ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యుల ఆధ్వర్యంలో అర్చకబృందం నిర్వహించారు. స్వామివారికి నిత్యపూజలు తెల్లవారుజాము మూడున్నర గంటల నుంచి మొదలయ్యాయి. స్వామిని సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చక బృందం తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి, స్వయంభుమూర్తులను అభిషేకించారు.
అనంతరం స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ చేపట్టారు. రాత్రి 7గంటల నుంచి అరగంట పాటు స్వామికి తిరువారాధన నిర్వహించిన అనంతరం తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. దీక్షాపరుల మండపంలో నిర్వహించిన వ్రత పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. స్వామివారి ఖజానాకు రూ.24,31,166 ఆదాయం సమకూరిందని ఈఓ ఎన్.గీత తెలిపారు.
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
తొలి ఏకాదశిని పురస్కరించుకుని పలువురు విద్యార్థినులు ఆలయంలో చేపట్టిన సాంస్కృతిక, భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ తూర్పు రాజగోపురం తిరువీధుల్లోని బ్రహ్మోత్సవ మండపం వద్ద రాంపల్లికి చెందిన సంస్కృత విశ్వ కళా మండలి, కళా చైతన్య వేదిక వ్యవస్థాపకుడు కె.రాంనర్సయ్య ఆధ్వర్యంలో చేపట్టిన నృత్యాలు అలరించాయి. విజయవాడకు చెందిన కూచిపూడి ఉపాధ్యాయురాలు హవిష సమక్షంలో 50మంది విద్యార్థినులు నృత్యాలు చేశారు. పలు భక్తి పాటలపై విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా చేపట్టిన కార్యక్రమాలను క్యూ లైన్లలో నిలుచున్న భక్తులు చూస్తూ ఉండిపోయారు.