పెద్దఅడిశర్లపల్లి జూలై 9 : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తాగు, సాగునీరు.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలకు తాగునీటిని అందించే ప్రధాన జలాశయం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. దీని ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. గతంలో రూ.7 కోట్లతో ఆనకట్ట, కాల్వల లీకేజీలకు మరమ్మతు చేపట్టగా తాజాగా గేట్ల మరమ్మతులకు రూ.99 లక్షలు విడుదల చేసింది. వీటితో గేట్ల రూప్లు, రోలర్లు, గేట్ల రబ్బర్ల ఏర్పాటు పనులు చేపడుతున్నారు. పది రోజుల్లో 70 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రత్యేక ఇంజినీర్ల బృందం పనులను పర్యవేక్షిస్తున్నది. ఇటీవల ఆనకట్ట 5 కిలోమీటర్ల పొడవునా కంపచెట్లు తొలగించగా సీపేజ్ నీటితో కట్టకు ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఏకేబీఆర్) మూడు లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీటిని అందించే ప్రధాన ప్రాజెక్టు. ఈ రిజర్వాయర్ ద్వారా నల్లగొండ జిల్లాతోపాటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని అందిస్తున్నది. రిజర్వాయర్ గేట్లు, ఇతర మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. గతంలో అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు స్వయంగా రిజర్వాయర్‌ను పరిశీలించి ఆనకట్ట లీకేజీలు అరికట్టేందుకు రూ.7కోట్లు మంజూరు చేసి పనులు పూర్తి చేశారు. తిరిగి ఈ ఏడాది రూ.99లక్షల వ్యయంతో గేట్లకు ముమ్మరంగా మరమ్మతులు చేపడుతున్నారు.
గేట్ల మరమ్మతు పనులు వేగవంతం
ఇప్పటికే ఆనకట్ట మరమ్మతులు పూర్తి కాగా ప్రస్తుతం రిజర్వాయర్ ప్రధాన గేట్లకు మరమ్మతులు చేపడుతున్నారు. తెగిన రూప్లు మార్చడంతో పాటు గ్రీజింగ్, పెయింటింగ్ పనులు సాగుతున్నాయి. ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయి. త్వరలో ఆయకట్టు నీటి విడుదలకు అంతరాయం లేకుండా ముందస్తుగా పనులు పూర్తి చేస్తాం.
– శ్రవణ్, జేఈ
10 రోజులుగా పనులు..
ఇప్పటికే రూ.7కోట్లతో ఆనకట్ట లీకేజీలకు మరమ్మతులు చేపట్టిన ప్రభుత్వం ప్రస్తుతం గేట్ల మరమ్మతులు చేస్తున్నది. గేట్ల శాశ్వత మరమ్మతుల కోసం రూ.99లక్షలతో పనులు చేపడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన స్వప్న కంపెనీ గేట్ల రూప్లు, రోలర్లకు మరమ్మతులు చేస్తున్నది. లీకేజీలు కాకుండా రబ్బర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఏకేబీఆర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం ఉండగా నీటిని తగ్గించకుండా అక్సిజన్ సిలిండర్ల సాయంతో నీటిలోకి వెళ్లి రూప్లను మారుస్తున్నారు. క్రాస్, ఎస్కేప్ రెగ్యులేటర్లకు సైతం మరమ్మతులు చేపడుతున్నారు. గేట్ల రూప్‌లకు ఆయిల్ మారుస్తూ సులువుగా తెరిచేలా చర్యలు చేపడుతున్నారు. భవిష్యత్‌లో అంతరాయం కలగకుండా ప్రత్యేక నిపుణులు, ఇంజినీర్ల సలహాల మేరకు పనులు చేపడుతున్నారు. ఇటీవల ఆనకట్ట 5కిలోమీటర్ల పొడవున కంపచెట్లు తొలగించారు. సీపేజ్ నీటితో కట్టకు ప్రమాదం కలగకుండా రాతి డ్రైన్ ద్వారా నీరు కాల్వలో చేరేలా చర్యలు చేపడుతున్నారు. పనులు చేపడుతున్న సమయంలో తాగు, సాగునీటికి అంతరాయం లేకుండా పనులు చేస్తున్నారు. దీంతో రిజర్వాయర్ మరింత పటిష్టం కానుంది.
1.5 టీఎంసీ సామర్థ్యం..
ఏఎమ్మార్పీలో కీలక భాగమైన ఏకేబీఆర్‌కు పుట్టంగండి సిస్టర్న్ ద్వారా 15 కిలోమీటర్ల లింక్ కెనాల్‌తో నీరు చేరుతుంది. 1.5 టీఎంసీ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌లో జంట నగరాలకు మూడు పైపులైన్లతో నిత్యం నీటి సరఫరా చేస్తున్నారు. వీటితోపాటు మిషన్ భగీరథ ద్వారా 600 గ్రామాలకుపైగా తాగునీటిని అందించడంతోపాటు బాట్లపల్లి ప్లాంట్‌కు నీటిని తరలిస్తున్నారు.