నకిరేకల్, జూలై 9 :పెరిగిన వంట గ్యాస్ ధరపై ఉమ్మడి జిల్లా ప్రజలు భగ్గుమంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని
మండిపడుతున్నారు. మోదీ సర్కారు తీరుపై శనివారం పలుచోట్ల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,దామరచర్ల మండలం వాడపల్లిలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఆందోళనలు చేయగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఖాళీ సిలిండర్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కట్టెల పొయ్యిపై వంట చేశారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేంద్రం మొండివైఖరి
ప్రదర్శిస్తున్నదని, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్నంటగా.. వంట గ్యాస్ ధర పెంపుతో సామాన్యుడి జీవితం
అతలాకుతలమవుతున్నదని పేర్కొన్నారు. ధరలు తగ్గించే వరకూ పోరాటం ఆగదని హెచ్చరించారు.
ఇష్టారీతిన గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ పోతున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సెగ తగిలేలా నిరసనలు తెలుపాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మెయిన్ సెంటర్లో ధర్నా నిర్వహించి వంటా వార్పు చేపట్టారు. అనంతరం ఖాళీ సిలిండర్లతో మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.400 ఉన్న సిలిండర్ ధరను బీజేపీ అధికారంలోకి వచ్చి రూ.1150 చేసిందని దుయ్యబట్టారు. ఇవాళ నిరుపేదలు గ్యాస్ వాడలేని పరస్థితి నెలకొందన్నారు. దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే నిత్యావసర ధరలు పెంచుతున్నారని విమర్శించారు. ఒకవైపు గ్యాస్ మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం ధరలను తగ్గించేంత వరకు నిరసనలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.