నీలగిరి, జూలై 9 : ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తర ప్రదేశ్‌కు గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, 200 కిలోల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. శనివారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున కేతేపల్లి, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మారుతి కారును ఆపి తనిఖీ చేశారు.
అందులో 200 కిలోల గంజాయిని గుర్తించి డ్రైవర్ ముబీన్షేక్ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ముబీన్షేక్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా పక్క గ్రామానికి చెందిన చందన్‌కుమార్ హరిజన్, పఠాన్ షేక్‌తో పరిచయం ఏర్పడింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గంజాయి రవాణా చేయడం మొదలు పెట్టారు. ముగ్గురు కారులో విశాఖపట్నం వచ్చి గంజాయి కొనుగోలు చేసి తీసుకెళ్తూ పోలీసుకు చిక్కారు. పోలీసులను చూసి పఠాన్ షేక్, చందన్‌కుమార్ హరిజన్ పరారీ కాగా ముబీన్ షేక్ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు కారుతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు.
ఆరు నెలల్లో 1,082 కిలోలు పట్టివేత
మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆరునెలల కాలంలో 1,082 కిలోల గంజాయిని పట్టుకొని 65 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా ఇతర రాష్ర్టాలకు చెందిన వారే ఉన్నారని, 20 శాతం మంది హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందినవారు ఉన్నారని తెలిపారు. జిల్లాలో గంజాయి రవాణాపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ మొగిలయ్య, నల్లగొండ డీఎస్పీ నరసింహారెడ్డి, నకిరేకల్ సీఐ రాఘవరావు, ఎస్ఐ అనిల్‌రెడ్డి, సిబ్బందిని ఆమె అభినందించారు.