యాదాద్రి, జూలై 9 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం స్వాతి నక్షత్ర పూజల కోలాహలం నెలకొంది. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలను సంప్రదాయరీతిలో నిర్వహించారు. తెల్లవారుజామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు ప్రధానాలయ ముఖ మండపంలో కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేకం పూజలు నిర్వహించారు. ముందుగా 108 వెండి కలశాలకు పూజలు చేశారు. పంచసూక్త పఠనంతో హోమం చేసి ఉత్సవమూర్తులను, ప్రతిష్ఠా అలంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్రనామార్చనలు చేశారు. తెల్లవారుజామున 4గంటల నుంచి ఐదున్నర గంటల వరకు గిరిప్రదక్షిణలో భక్తులు పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
యాదాద్రిలో నిత్యపూజల కోలాహలం
స్వయంభువుడికి నిత్యపూజల కోలాహలం నెలకొంది. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. తిరువారాధన, బాలబోగం, స్వామివారికి నిజాభిషేకం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు తులసీ సహస్రనామార్చనలు, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు చేపట్టారు. ప్రధానాలయ లోపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, స్వామి, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు, వెండి మొక్కుజోడు సేవలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. క్యూ కాంప్లెక్స్ చెంత కొలువైన క్షేత్ర పాలక ఆంజనేయస్వామికి నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. స్వయంభువులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్టలో స్వామివారి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ.21,20,217 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు.