నల్లగొండ, జూలై 8: జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్రెడ్డి చైర్మన్గా బాధ్యతలు చేపట్టి మూడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం స్థానిక జడ్పీ కార్యాలయంలో ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించారు. బొకేలు అందించి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. జడ్పీ చైర్మన్తో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ మూడేండ్లలో జిల్లా పరిషత్లో ఎంతో అభివృద్ధి సాధించా మన్నారు. జూనియర్ అసిస్టెంట్లు, కాపలాదారులు మొత్తం 94 మందిని కారుణ్య నియామకాలు చేపట్టగా 229 మందికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు.
నెల రోజుల్లోనే జిల్లాలోని 31 మండలాలు, 844 గ్రామ పంచాయితీల్లో జీవ వైవిధ్య కమిటీలు వేసి ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రం అందుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి 10,131 మంది విద్యార్థులకు డిక్షనరీలు అందజేశామన్నారు. 213 పాఠశాలల్లో సైన్స్ పరికరాలు, మౌలిక సదుపాయాల కల్పనకు, మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.1.25 లక్షల చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులను కేటాయించామని చెప్పారు. అన్ని పాఠశాలల్లో సిబ్బంది రేషనలైజేషన్ కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ, ఉద్యోగులు సత్యనారాయణరెడ్డి, రాంబాబు, యాకూబ్నాయక్, ఈఈ తిరుపతయ్యతోపాటు సూపరింటెండెంట్లు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.