నల్లగొండ, జూలై 8 : ఈ నెల 12న నకిరేకల్ మండలంలోని చందుపట్లలో నిర్వహించే కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత అదికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిదులు హాజరౌతున్నందున ఏ లోటు రాకుండా చూడాలని తెలిపారు. తెలంగాణ వంటకాలు అందరికీ పరిచయం చేసేలా స్టాల్స్, గ్రామ ఆరంభంలో తోరణం ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. స్థానిక జడ్పీ పాఠశాలలో పేరిణి, కూచిపుడి నృత్యం, నాటకాలను తెలంగాణ సాంస్కృతిక సారదులతో నిర్వహించాలన్నారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ జగదీశ్వర్‌రెడ్డి, జిల్లా పర్యాటక అధికారి శివాజి, డీపీఆర్ఓ శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, నకిరేకల్ ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు, పురావస్తు శాఖ అధికారి ఆదిత్య, ఎన్జీ కళాశాల అధ్యాపకుడు టంగుటూరు సైదులు పాల్గొన్నారు.