భువనగిరి అర్బన్, జూలై 8 : పాల ఉత్పత్తులను కేంద్రం జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలని నల్లగొండ-రంగారెడ్డి మదర్ డెయిరీ నార్మాక్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరి పట్టణ పరిధిలోని డెయిరీ డైరెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో నూటికి 60 శాతం ప్రజలు వ్యవసాయ రంగం, అనుబంధ పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. సుమారు 9 కోట్ల గ్రామీణ కుటుంబాలు ప్రత్యేకంగా సన్న, చిన్నకారు రైతులు, మహిళలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నట్లు చెప్పారు. ఉపాధిలేక పాడిని నమ్ముకుని కుటుంబ పోషణ చేస్తున్న పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం పాల ఉత్పత్తులను జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలన్నారు. లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డెయిరీ డైరెక్టర్లు కాయితి వెంకట్‌రెడ్డి, సీహెచ్.వెంకట్రాంరెడ్డి, శ్రీకర్‌రెడ్డి పాల్గొన్నారు.