బొడ్రాయిబజార్, జూలై 6 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో అమలవుతున్న ఈ-నామ్ విధానాన్ని పరిశీలించేందుకు హైదరాబాద్ రీజియన్ అధికారుల బృందం బుధవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. ఈ-నామ్ అమలు విధానం, రైతులకు అందుతున్న సేవల గురించి మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవీఆనంద్, మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఫసియొద్దీన్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఇఫ్తికార్ నజీర్, డిప్యూటీ డైరెక్టర్ పద్మాహర్ష మాట్లాడుతూ.. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఈ-నామ్ విధానం సమర్థవంతంగా అమలవుతుందన్నారు. సూర్యాపేట మార్కెట్ ఇతర మార్కెట్లకు ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ఇక్కడ అమలవుతున్న ఈ-నామ్‌ను పరిశీలించేందుకు పలు రాష్ర్టాల నుంచి ఐఏఎస్‌లు వచ్చి సందర్శించి ఆయా రాష్ర్టాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
పేట ఈ-నామ్ విధానంతో రైతులకు మేలు జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా సూర్యాపేట ఈ-నామ్ అమలుకు కృషి చేస్తామని తెలిపారు. మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితాదేవీఆనంద్ మాట్లాడుతూ.. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఈ-నామ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ రైతులకు ఉత్తమ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్‌ను సందర్శించిన వారిలో వరంగల్ రీజినల్ మార్కెటింగ్ అధికారి మల్లేశం, వరంగల్ డీడీ అజ్మీరారాజు, డీఎంఓలు సారిక, బాలమణి, రియాజ్, పుష్పమ్మ, సారంగపాణి, స్వర్ణజిత్సింగ్, రమ్య, ఛాయాదేవితోపాటు 8 జిల్లాల మార్కెట్ కార్యదర్శులు, హైదరాబాద్ రీజియన్ డీఏఓలు ఉన్నారు. కార్యక్రమంలో మార్కెట్ ఉప కార్యదర్శి షంషీర్, అసిస్టెంట్ సెక్రటరీ పుష్పలత, యూడీసీ కాశీం, మార్కెట్ సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.