నల్లగొండ, జూలై 6: వానకాలం సీజన్లో నైరుతి రుతుపవనాలు సకాలంలో రాక వర్షాలు ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం సాధారణం కంటే ఎక్కువగా కురిశాయి. జిల్లా వ్యాప్తంగా ఇటీవల సమృద్ధిగా వర్షాలు పడుతుండటంతో రైతులు ఆనందంతో పంటల సాగులో నిమగ్నమయ్యారు. ఈ సీజన్లో 108.0 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా ఇప్పటివరకు 152.6మి.మీ. పడటంతో 41.3శాతం అదనంగా నమోదైంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3.08 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా తెలంగాణకు హరితహారం పథకం కింద మొక్కలు మెరుపు వేగంతో నాటుకుంటున్నాయి.
41.3శాతం అదనపు వర్షపాతం
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది కురువాల్సిన వర్షం కంటే 41.3శాతం అధికంగా నమోదైంది. ఈ సీజన్లో జూన్ నెలకు సంబంధించి సాధారణంగా 85.2 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 93.1 మి.మీ. కురవడంతో 9.3శాతం అదనంగా నమోదైంది. జులైలో 145.2 మి.మీ. సాధారణ వర్షపాతానికి గాను ఈ ఆరు రోజుల్లోనే 59.5 మి.మీ. కురవడంతో 160.5శాతం అధికంగా నమోదైంది. జిల్లాలో 31 మండలాలకుగాను 4 మండలాల్లో లోటు వర్షపాతం ఉండగా ఏడు మండలాల్లో సాధారణ వర్షం, మిగిలిన 20 మండలాల్లో అదనపు వర్షపాతం నమోదైంది.
పెరుగుతున్న సాగు..నాటుకుంటున్న మొక్కలు
జిల్లాలో సాధారణానికి మించిన వర్షపాతం కురుస్తుండటంతో వానకాలం సాగు క్రమంగా పెరుగుతున్నది. ఈ సీజన్లో ఇప్పటివరకు 2.90లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా ఇతర పంటలు మరో 18 వేల దాకా సాగయ్యాయి. ఇక జూలైలోనే అధిక వర్షాలు పడటంతో తెలంగాణకు హరితహారం కింద మొక్కలను అదికారులు వేగంగా నాటుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్లో హరితహారం కింద 2.07 కోట్ల మొక్కలు నాటాల్సి ఉండగా ఈ నెల 12 నాటికి 75శాతం మొక్కలు నాటాలని ఆయా జిల్లాల కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దాంతో ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి యంత్రాంగం కింది స్థాయి అధికారులతో సమీక్షించి మొక్కల నాటింపు వేగవంతం చేయాలని సూచించారు.
గుండ్లపల్లిలో 8 సెం.మీ.అధిక వర్షపాతం
జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు 31 మండలాలకుగాను 30 మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా గుండ్లపల్లిలో 82.2 మి.మీ. వర్షం పడగా చందంపేటలో 68.1, అడవిదేవులపల్లిలో 64.0, చిట్యాలలో 51.4, నల్లగొండలో 51.0, తిరుమలగిరి సాగర్‌లో 44.3, దామరచర్లలో 43.2, నార్కట్‌పల్లిలో 42.7, కట్టంగూర్‌లో 41.9, త్రిపురారంలో 41.4, తిప్పర్తిలో 37.1, మునుగోడులో 34.2, నకిరేకల్‌లో 33.3, మాడుగులపల్లిలో 32.5, దేవరకొండలో 32.2, కనగల్‌లో 30.1, నేరేడుగొమ్ములో 30.0, అనుములలో 28.4, నిడమనూరులో 27.9, వేముల పల్లిలో 27.9, చింతపల్లిలో 24.3, గుర్రంపోడులో 23.7, శాలిగౌరారంలో 23.6, పీఏ పల్లిలో 22.8, కొండమల్లే పల్లిలో 22.8, కేతేపల్లిలో 22.0, మిర్యాలగూడలో 21.2, పెద్దవూరలో 20.5, నాంపల్లిలో 19.8, చండూర్లో 12.1, మర్రిగూడలో అత్యల్పంగా 5.8 మి.మీ. వర్షం పడింది.