మిర్యాలగూడ రూరల్, జూలై 2 : జాతీయ ఉపాధిహామీ పనులు మిర్యాలగూడ మండలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారులు గ్రామాల్లో గుర్తించిన పనులు చేపడుతూ.. కూలీలను భాగస్వాములను చేస్తున్నారు. మండలంలోని 46 గ్రామ పంచాయతీల్లో మొత్తం 20,064 జాబ్ కార్డులు ఉండగా అందులో 15,822 జాబ్ కార్డులున్న వారికి పని కల్పించారు.
ఆయకట్టు గ్రామాల్లో అధికంగా..
మండలంలోని గ్రామాలన్ని నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద ఉన్నాయి. సాగునీరు విడుదలైతే పొలం పనులతో కూలీలు బిజీగా ఉంటారు. వ్యవసాయ పనులు లేని సమయంలో కూలీలకు పనులు లభించే అవకాశం ఉండదు. దాంతో నాన్ వ్యవసాయ సీజన్లో ఉపాధి పనులు చేపడుతూ కూలీలకు పనులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం కూడా సాగునీరు విడుదల కాక ముందే సాధ్యమైంత ఎక్కువ శాతం పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. ఎక్కువ మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు. ఫలితంగా మూడు నెలల్లోనే ఉపాధి లక్ష్యంలో సగం పూర్తి చేశారు.
60 రోజుల్లో ..
మండలంలో జాతీయ ఉపాధిహామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 3,32,908 పని దినాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. అందుకు అనుగుణంగా అధికారులు మే నెల మొదటి వారంలో పనులు ప్రారంభించారు. రోజుకు సుమారు 400 మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్న అధికారులు 60 రోజుల్లోనే 1,69,905 పని దినాలు కల్పించి 60 శాతం పనులను పూర్తి చేశారు. సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదలయ్యే నాటికి 85 శాతం పనిదినాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులను కొనసాగిస్తున్నారు.
కూలీలందరూ హాజరయ్యేలా చర్యలు
జాతీయ ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డులు పొందిన కూలీలు వందశాతం హాజరయ్యే విధంగా ప్రోత్సహిస్తున్నాం. అన్ని గ్రామాల మేట్లను ప్రతి రోజు అలర్ట్ చేస్తున్నాం. దాంతో వేసవిలోనే ఎక్కువ పనిదినాలు పూర్తయ్యేలా పనులను వేగవంతం చేశాం. ఈ సంవత్సరం లక్ష్యంలో ఇప్పటికే 60 శాతం పూర్తి చేయగలిగాం. లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తాం.
-శిరీష, ఏపీఓ, మిర్యాలగూడ
ముందస్తు ప్రణాళికతో..
మండలం సాగర్ ఆయకట్టు కింద ఉంది. దాంతో కాల్వకు నీరు విడుదలైతే కూలీలు సాగుపనులకు వెళ్తారు. దాంతో వేసవలోనే ఎక్కువ శాతం పని పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందస్తు ప్రణాళికతో వెళ్తున్నాం. గ్రామాల్లో మేట్లు, టీఏలు, కూలీలను చైతన్య పరిస్తూ పనుల్లో వేగం పెంచాం. ఫీడర్ చానల్స్, చెరువు పనులు, పొలాలకు వెళ్లే పిల్ల కాల్వ పనులను పూర్తి చేస్తున్నాం. హరితహారం మొక్కలు నాటేందుకు కావాల్సిన గుంతలు తీయిస్తున్నాం.
-గార్లపాటి జ్యోతిలక్ష్మి, ఎంపీడీఓ, మిర్యాలగూడ