రామగిరి, జూన్ 28 : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 30న నిర్వహించే టీఎస్ పాలిసెట్-2022 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, సెట్ కన్వీనర్ పి.జానకీదేవి సూచించారు. మంగళవారం ఆ కళాశాలలో టీఎస్ పాలిసెట్ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్స్తో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నల్లగొండలోని 10 పరీక్ష కేంద్రాల్లో 4,744 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. వీరిలో బాలురు 2,663, బాలికలు 2,081 మంది ఉన్నట్లు తెలిపారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉండదన్నారు. విద్యార్థులు http//polycetts.nic.in ద్వారా హాల్టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. సమావేశంలో ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.