పీఏపల్లి మండలంలో విద్యార్థుల్లేక పదేండ్ల కింద మూతబడిన వడ్డెరగూడెం ప్రాథమిక పాఠశాల ఈ విద్యా సంవత్సరం తిరిగి తెరుచుకున్నది. ప్రస్తుతమిక్కడ 25 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు.
త్రిపురారం మండలంలోని రాగడప ప్రైమరీ స్కూల్ ఐదేండ్లకు రీ ఓపెన్ అయ్యింది. 13 మంది విద్యార్థులతో సందడిగా కనిపిస్తున్నది.
..ఇలా ఈ విద్యా సంవత్సరం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 16 ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దాంతో ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం పిల్లలను ప్రైవేట్ బాట పట్టించిన తల్లిదండ్రులకు ఫీజుల భారం, నిత్యం పది కిలోమీటర్లు ప్రయాణించిన విద్యార్థులకు దూరభారం తప్పింది. ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతం కోసం రాష్ట్ర సర్కారు తీసుకున్న చర్యలు కలిసివచ్చాయి. 317 జీఓతో మూతబడిన పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించడం, మన ఊరు – మన బడితో వసతుల కల్పన, ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో మార్పు కనిపిస్తున్నది. బడిబాట ద్వారా ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం వల్ల అడ్మిషన్లు మొదలై, ఏండ్ల తరబడి మూతబడిన పాఠశాలలు సైతం తిరిగి తెరుచుకుంటున్నాయి.
జిల్లాలు, జోనల్ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 317తో మారుమూల ప్రాంతాలు, తండాల్లోని సర్కారు బడులకు టీచర్లను కేటాయించారు. ఈ జీఓతో నల్లగొండ జిల్లాలో పిల్లలు లేక మూతబడిన 46 పాఠశాలలకు ఉపాధ్యాయులు వచ్చారు. టీచర్లు రావడంతోపాటు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల భారంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు. దాంతో గతేడాది వరకు వెలవెలబోయిన ఆయా పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. మూతబడిన బడులను తెరిచి అడ్మిషన్లు కల్పించడంతో ఆయా ప్రాంతాల్లోని తల్లిదండ్రులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అందరికీ నాణ్యమైన విద్యకు చర్యలు
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన గుణాత్మక విద్య అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో విద్యార్థుల్లేక మూతబడిన 46 పాఠశాలకు సైతం జీఓ 317 ద్వారా వచ్చిన ఉపాధ్యాయులను కేటాయించాం. మూతబడిన బడుల్లో పిల్లలను చేర్పించి కచ్చితంగా తిరిగి తెరిచేలా చూడాలని రాష్ట్ర విద్యాశాఖ సూచనలతో ఆయా మండలాల ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. మరో వైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు – మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమంతో మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి తెచ్చింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తుండడం సంతోషంగా ఉంది. ప్రత్యేక శ్రద్ధతో విద్యనందించి విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేస్తాం.
– బి.భిక్షపతి, నల్లగొండ డీఈఓ

రెండేండ్లకు తెరుచుకున్న బడి
చౌటుప్పల్ రూరల్/జూన్18: మన ఊరు – మన బడి, బడి బాట కార్యక్రమాలతో సర్కారు బడులకు పూర్వ వైభవం వస్తున్నది. విద్యార్థులు చేరుతుండడంతో మూతబడిన స్కూళ్లు సైతం తెరుచుకుంటున్నాయి. చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని పద్మానగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలను 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గడంతో రెండేండ్ల కింద ఆ బడిని మూసివేశారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయురాలు ఎస్.రాధిక స్థానికుల సహాయంతో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో సర్కారు కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు. దీంతో విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఐదుగురు అడ్మిషన్లు తీసుకోగా.. మరో 13 మంది చేరేందుకు సిద్ధమయ్యారు.
మరిన్ని అడ్మిషన్లు రానున్నాయి..
రెండు సంవత్సరాల క్రితం విద్యార్థులు లేకపోవడంతో పద్మానగర్ కాలనీ పాఠశాల మూతపడింది. దీంతో ఇంటింటికీ తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించాం. సర్కారు బడిలో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అడ్మిషన్లు పెరుగనున్నాయి.
– ఎస్.రాధిక, పాఠశాల ఉపాధ్యాయురాలు
పునఃప్రారంభమైన బాసోనిబావి తండా పాఠశాల
పెద్దవూర : ఈ సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో మూడేండ్ల క్రితం మూతబడ్డ బాసోనిబావి తండా ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభమైంది. 2019లో విద్యార్థుల్లేక మూతబడిన ఈ బడిలో ఈ ఏడాది 15 మంది జాయిన్ అయ్యారు. విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నట్లు ప్రధానోపాధ్యాయుడు లచ్చిరాంనాయక్ తెలిపారు.
ఇంగ్లిష్ విద్య అందించడం హర్షణీయం
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం హర్షణీయం. మూడేండ్ల కింద ఇంగ్లిషు కోసం మా తండాలోని విద్యార్థులంతా సమీపంలోని ప్రైవేటు పాఠశాలకు వెళ్లారు. దీంతో గ్రామంలోని సర్కారు బడి మూతబడింది. ఈ సంవత్సరం సర్కారు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తుండడంతో మళ్లీ మా తండా పాఠశాల తెరుచుకోవడం సంతోషంగా ఉంది. మరికొంత మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంది.
– ముడావత్ బాలాజీనాయక్, ఎంపీటీసీ
రాగడప పాఠశాలలో 23 అడ్మిషన్లు ఐదేండ్ల తర్వాత పునఃప్రారంభం
త్రిపురారం : మండలంలోని రాగడప గ్రామంలో రెండు ప్రైవేటు స్కూళ్ల కారణంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పంపడానికి పిల్లల తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. దీంతో విద్యార్థుల్లేక 2017లో సర్కారు బడిని మూసేశారు. ఈ సంవత్సరం బడిబాట కార్యక్రమంలో ఈ నెల 5నుంచి ఉపాధ్యాయులు గడప గడపకూ తిరిగి ఇంగ్లిష్ విద్యా బోధన, అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. దీంతో సర్కారు బడిలో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎంఈఓ బాలాజీనాయక్, స్పెషల్ ఆఫీసర్ వీరయ్య ఈ నెల 14న 20 మంది విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించారు.
ప్రైవేటు నుంచి సర్కారు బడికి..
పదేండ్ల తర్వాత తెరుచుకున్న వడ్డెరగూడెం ప్రభుత్వ పాఠశాల
పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని తిరుమలగిరి గ్రామపంచాయతీ పరిధి వడ్డెరగూడెంలో 200కు పైగా నివాసాలు ఉన్నాయి. గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపడంతో పదేండ్ల క్రితం విద్యార్థుల్లేక గ్రామంలోని సర్కారు బడిని మూసివేశారు. ఆ గ్రామ విద్యార్థులు నిత్యం బస్సులో పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేటు పాఠశాలకు వెళ్లేవారు. ఈ సంవత్సరం బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, అందుతున్న సౌకర్యాలు, నాణ్యమైన విద్య గురించి ఉపాధ్యాయులు వివరించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడికి పంపేందుకు అంగీకరించారు. దీంతో పాఠశాలను తిరిగి ప్రారంభించారు. మొదటి రోజే 25 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. మరో 20 మంది చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. తమకు ఆర్థిక, ప్రయాణ భారం తప్పిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.40వేలు పిల్లల సదువులకే అయ్యేది..
మా పిల్లలను పీఏపల్లిలోని ప్రైవేటు పాఠశాలకు పంపిస్తే ఏటా రూ.40వేలు ఖర్చు అయ్యేది. ఊళ్లో ఎప్పుడో మూతబడ్డ సర్కారు బడిని గిప్పుడు తెరిస్తే మా ఇద్దరు పిల్లలను అందులోకే పంపిస్తున్నా. వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు పాఠశాలకు పంపే కంటే సర్కారు బడే నయం అనిపిస్తుంది. మా ఊళ్లో వాళ్లందరం పిల్లలను సర్కారు బడికి పంపించాలని నిర్ణయించుకున్నాం.
– వరికుప్పల రాములు, వడ్డెరగూడెం
దేవరకొండ ప్రైవేటు హాస్టల్లో ఉండి చదువుకున్న
నేను ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న. నాలుగు వరకు దేవరకొండ ప్రైవేటు స్కూల్ హాస్టల్లో ఉన్నా. ఈ సంవత్సరం మా ఊరి బడిలోనే చదువుకుంటున్నా. బడిలో మధ్యాహ్న భోజనం కూడా పెడుతున్నారు.
– వరికుప్పల అశ్విత, వడ్డెరగూడెం