మిర్యాలగూడ రూరల్, జూన్ 18 : మండలంలో అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి కోరారు. శనివారం మండలంలోని కొత్తగూడెం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ మద్దెల శ్రీలతావిక్టర్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి వేగవంతమైందన్నారు. పారిశుధ్యం మెరుగు పడిందని, మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. పల్లె పకృతి వనాలతో పల్లెల్లో పచ్చదనం వెల్లివిరుస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి, నోడల్ ఆఫీసర్ మన్నెం గుర్వారెడ్డి, పంచాయతీ కార్యదర్శి నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
కొండమల్లేపల్లి : ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని కొండమల్లేపల్లి సర్పంచ్ కుంభం శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. పల్లెప్రగతిలో వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించామని, ఇంకా ఏవైనా సమస్యలుంటే నేరుగా గ్రామపంచాయతీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ఉపసర్పంచ్ గంధం సురేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ముగిసిన పట్టణ ప్రగతి
హాలియా : పట్టణ ప్రగతి కార్యక్రమం శనివారం ముగిసింది. 15 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో హాలియా మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించారు. తాగునీరు, విద్యుత్, అంతర్గత రోడ్లు, వీధిలైట్లు, పారిశుధ్యం వంటి వాటిని మెరుగు పర్చారు. వీధుల్లో ఉన్న చెత్తను తొలగించారు. డ్రైనేజీలను శుభ్రం చేశారు. అంతర్గత రోడ్లవెంట మొక్కలు నాటారు.