క్రూడాయిల్ ధర పెరుగుదలను కంపెనీలే భరించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు ఆయా కంపెనీ వర్గాల కథనం. దాంతో ఇటీవల రూ.28 వరకు ధర పెరుగగా ఆ భారం కంపెనీలపై పడినట్లు సమాచారం. పెరిగిన ధరను భరించి ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌ను అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు చేయాలంటే కంపెనీలు నష్టాలను చవిచూడాల్సి వస్తున్నది. దాంతో కంపెనీలు రెగ్యులర్‌గా కొనుగోలు చేసే సామర్థ్ద్యాన్ని పక్కన పెట్టి తక్కువ కొనుగోలు చేసే మరో మార్గాన్ని ఎంచుకున్నాయి. దీంతో పాటు రిలయన్స్, ఎస్సార్ లాంటి బంకులు తమ అవుట్ లెట్స్ ద్వారా విక్రయాలు నిలిపివేయడం వల్ల కూడా ఇతర కంపెనీలపై ప్రభావం చూపుతున్నది. ఫలితంగా క్షేత్రస్థాయిలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై ప్రభావం పడుతున్నది. పలు కంపెనీల నుంచే డీలర్లకుతక్కువ సరఫరా జరుగుతున్నది. దీనివల్ల కిందిస్థాయిలో అవసరమైన పెట్రోల్, డీజిల్ లభించని పరిస్థితులు కొన్నిసార్లు ఉత్పన్నం అవుతున్నది. కేంద్ర ప్రభుత్వం కొర్రీలతో కంపెనీలు సైతం డీలర్ల విషయంలో పలు నిబంధనలు విధిస్తున్నాయి.
అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లిస్తేనే..
గతంలో డీలర్లకు క్రెడిట్ మీద పెట్రోల్, డీజిల్ సరఫరా చేసేవారు. దాంతో డీలర్లు తాము తీసుకున్న పెట్రోల్, డీజిల్‌ను విక్రయించిన అనంతరమే కంపెనీలకు డబ్బులు చెల్లించేవారు. దీనివల్ల డీలర్లకు కొంతమేర ఆర్థ్దికంగా వెసులుబాటు లభించేది. ప్రస్తుతం క్రెడిట్ సప్లయ్‌కు కంపెనీలు పూర్తిగా నిరాకరిస్తూ అడ్వాన్స్ చెల్లింపులు చేయాలని డీలర్లకు సూచించింది. డీలర్లు కూడా ఉన్నఫలంగా అడ్వాన్స్ చెల్లింపులు చేసి కొనుగోలు చేయడంలో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. వీటన్నింటి ఫలితంగా క్షేత్రస్థాయిలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై ప్రభావం పడుతున్నది. కొద్దిరోజులుగా ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల అప్పుడప్పుడు నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ముఖ్యంగా భారత్ పెట్రోలియం కంపెనీ క్రెడిట్ సేల్స్ మొత్తంగా మూసివేయడంతో ఈ బంకుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నది. వీటిపై ఆధారపడి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే వారు అనివార్యంగా ఐఓసీ, హెచ్‌పీ కంపెనీల బంకులకు మళ్లడంతో వీటిపైనా రద్దీ పెరిగి ప్రభావం చూపుతున్నది.
అప్రమత్తమైన అధికారులు..
క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై సామాన్యులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు జిల్లాయంత్రాంగాలను కూడా అప్రమత్తం చేసింది. సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లాలో కలెక్టర్ పమేలా సత్పతి పౌరసరఫరాల అధికారులు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశారు. వినియోగదారులకు రోజువారీ అవసరాలకు సరిపడా నిల్వలను . తెలంగాణ పెట్రోలియం ఉత్పత్తులు 1980, క్లాజ్-12(1)(1) ప్రకారం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.నల్లగొండలో జిల్లా పౌరసరఫరా అధికారి వూర వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సమావేశం నిర్వహించారు. కొరత రాకుండా చూడాలని స్పష్టం చేశారు.
కృత్రిమ కొరతపై ప్రత్యేక నిఘా..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ జిల్లాకు వచ్చేలా చూడాలని కంపెనీల సేల్స్ ఆఫీసర్లను అప్రమత్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కృత్రిమ కొరతపైనా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక నిఘా పెట్టారు. ఒకేసారి పెద్ద మొత్తంలో డీజిల్ లేదా పెట్రోల్లను డ్రమ్ముల్లో తరలించడం లాంటివి చేపట్టినా నిఘా పెట్టనున్నారు. అలాగే అన్ని బంకుల్లో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. అంతిమంగా క్షేత్రస్థాయిలో వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా సరఫరా జరిగేలా అధికారయంత్రాంగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా అంతటా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నట్లు డీఎస్ఓ వెంకటేశ్వర్లు వెల్లడించారు. కంపెనీల సేల్స్ ఆఫీసర్లతో పాటు బంకు యజమానులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, మంగళవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో తాజా పరిస్థితిపై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.