నీలగిరి, జూన్ 14 : ఈ నెల 18 నుంచి 26 వరకు రేషన్ కార్డుదారులందరికీ 5 కిలోల రేషన్ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి ఊర వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం తన చాంబర్లో పౌరసరఫరాల అధికారులు, రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులందరికీ ఉచితంగా అందజేస్తున్న బియ్యాన్ని పకడ్బందీగా పంపిణీ చేయాలన్నారు. అదేవిధంగా ఈ నెలతో ఈపీఎస్ మిషన్ల గడువు ముగిసినందున వచ్చే నెల నుంచి నూతన మిషన్లను ప్రతి రేషన్ డీలర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్ఓ నిత్యానందం, ఆర్ఐ లింగస్వామి, రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధి నాగరాజు పాల్గొన్నారు.