నల్లగొండ, జూన్ 12 : చికెన్ ధర సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నది. మూడు నెలలుగా ఇదే ధోరణి కనిపిస్తున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతుండడంతో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దాంతో ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ. 260కి చేరగా స్కిన్లెస్ రూ.300, బోన్‌లెస్ కిలో రూ.580 వరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి జిల్లా వ్యాప్తంగా సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నది. హై టెంపరేచర్ కారణంగా వ్యాపారులు కోళ్ల ఉత్పత్తి విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అధిక వేడితో కోడి పిల్లలు చనిపోతుండడంతో ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గి ధరలు అమాంతం పెరిగాయి.
తగ్గిన కోళ్ల ఉత్పత్తి
జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మూడు నెలలుగా కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఫామ్‌లో వేసిన కోడి పిల్లల్లో 20 నుంచి 30 శాతం వరకు చనిపోతుండడంతో ఉత్పత్తి తగ్గించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఏసీ ఫామ్‌లో కోళ్లను పెంచే వారు వాటి సామర్థ్యాన్ని బట్టి పెంచుతున్నప్పటికీ చిన్న వ్యాపారులు మాత్రం షెడ్లకు తాళం వేసుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదవుతుండడంతో వర్షాలు కురిసే వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. గతేడాది ఇదే సమయంలో కరోనా లాక్డౌన్ కారణంగా ఉత్పత్తి తగ్గగా ఈ సారి హై టెంపరేచర్ కారణంగా ఉత్పత్తి తగ్గి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి.
రోజుకు 30 వేలకు పైగా కోళ్ల విక్రయాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 8వేల రిటైల్, మరో వంద వరకు హోల్‌సేల్ అండ్ రిటైల్ చికెన్ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో ప్రతి రోజు 30 వేల నుంచి 40 వేల కోళ్ల అమ్మకాలు జరుగుతుంటాయి. ప్రధానంగా మూడు జిల్లాల్లో ఎనిమిది హోల్‌సేల్ వ్యాపారానికి సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. అయితే అధిక ఉష్ణోగ్రత కారణంగా వేసవిలో రోజూ 20 నుంచి 30 వేల కోళ్లకు మించి సరఫరా చేయలేని పరిస్థితిలో వ్యాపారులు ఉన్నారు. ఒక్కో కోడి రెండు కిలోల సగటున బరువు వేసుకున్నా రోజూ రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల వ్యాపారం జరుగుతున్నది. సాధారణంగా మృగశిర నాటికే వర్షాలు కురువాల్సి ఉన్నప్పటికీ నైరుతి రుతుపవనాల ఆలస్యం కారణంగా ఇప్పటి వరకు వర్షం కురువలేదు. దాంతో ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. ఈ నెల 15 నాటికి వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో ఆ తర్వాతే పౌల్ట్రీ ఫామ్‌ల యజమానులు కోళ్ల పెంపకంపై దృష్టి సారించే అవకాశం ఉంది.
స్కిన్లెస్ రూ.300
మాంసం ప్రియులకు నిత్యం అందుబాటులో ఉండేది బాయిలర్ చికెన్ మాత్రమే. చికెన్ ధర అందరికీ అందుబాటులో ఉంటుండడంతో అన్ని వర్గాల వారు అధికంగా వినియోగిస్తుంటారు. కానీ నేడు కిలో రూ.260 వరకు పలుకుతున్నది. స్కిన్లెస్ అయితే రూ.300, బోన్‌లెస్ రూ.580 వరకు అమ్ముతున్నారు. సాధారణంగా కోడి పిల్లలు పెంచితే 40 నుంచి 45 రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. జిల్లా వ్యాప్తంగా హై టెంపరేచర్ కారణంగా మూడు నెలలుగా ఉత్పత్తి మందగించింది. ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల నష్టాలు వస్తాయని ఉత్పత్తిదారులు కోళ్ల పెంపకాన్ని నిలిపి వేశారు. దానికి తోడు ప్రస్తుతం పెండ్లిళ్లు, ఫంక్షన్లు అధికంగా జరుగుతుండడంతో డిమాండ్‌కు అనుగుణంగా కోళ్ల సరఫరా లేక ధర ఊహించనంతగా పెరిగి సామన్యులకు అందుబాటులో లేకుండా పోయింది.
డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేదు
మూడు నెలలుగా మార్కెట్లోకి కోళ్లు పెద్దగా రావడం లేదు. ఈ సారి హై టెంపరేచర్ వల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గినట్లు కంపెనీ వాళ్లు అంటున్నారు. దాంతో కిలో చికెన్ రూ.260 దాకా ఉంది. పైగా ఫంక్షన్లు బాగా ఉండటంతో చికెన్‌కు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో డిమాండ్ మేరకు సైప్లె లేనందున చికెన్ ధరలు ఇప్పట్లో తగ్గక పోవచ్చు.
-కనకయ్య, కావేరి చికెన్ సెంటర్, నల్లగొండ