చండూరు, జూన్ 13 : నేర నియంత్రణ కోసం గ్రామస్థాయి నుంచే చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా గ్రామాల్లో విస్తృతంగా సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రతి గ్రామపంచాయతీలో కెమెరాల ఏర్పాటుకు సర్పంచులు, వ్యాపారులు, దాతల సహకారంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. చండూరు సీఐ అశోక్ రెడ్డి ప్రత్యేక చొరవతో సర్కిల్ పరిధిలోని చండూరు, మునుగోడు, కనగల్ మండలాల్లోని సుమారు 20 గ్రామాల్లో 218 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మిగిలిన గ్రామాల్లోనూ దాతలు ముందుకు వస్తుండడంతో 95 కెమెరాల ఏర్పాటు పనులు కొనసాగుతున్నట్లు సమాచారం. చండూరు మండలంలో 23 పంచాయతీలు ఉండగా 9 గ్రామాల్లో, చండూరులో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మునుగోడు మండలంలో 11 గ్రామాలు, కనగల్ మండలంలో 10 గ్రామాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయి.
సీసీ కెమెరాల పర్యవేక్షణ
గ్రామాల్లో తరచుగా జరిగే గొడవలకు ఎలాంటి సాక్ష్యాధారాలు ఉండకపోవడంతో బాధితులకు సరైన న్యాయం జరగడం లేదు. ఒక్కసారి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన తరువాత ఎలాంటి మార్పునకు అవకాశం ఉండదు. వాహనాలను ఢీకొట్టి పారిపోయేవారు, బైకులు దొంగిలించే వారు, మహిళల మెడలో పుస్తెలతాళ్లు అపహరించేవారు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అవడంతో తప్పించుకునే ఆస్కారం ఉండదు.
ముందుకు వస్తున్న దాతలు
పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. దాంతో ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు వస్తుండడంతో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. చండూరు మండలంలోని తుమ్మలపల్లిలో సుమారు రూ. 2 లక్షలతో యెత్తెపు మధుసూదన్‌రావు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, గట్టుప్పల్, బొడంగిపర్తి, కొండాపురం, తేరట్పల్లి, కమ్మగూడెం గ్రామ పంచాయతీలో ప్రజాప్రతినిధుల సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి
ఎస్పీ ఆదేశాలతో చండూరు సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాల్లో నేర నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, ప్రజలు, వ్యాపారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో దాతలు ముందుకు వచ్చి కెమెరాల ఏర్పాటుకు సహకరిస్తున్నారు. దీంతో నేరాలను గుర్తించడం చాలావరకు సులువైంది.
– అశోక్‌రెడ్డి, సీఐ, చండూరు సర్కిల్
మరింతమంది దాతలు ముందుకు రావాలి
గ్రామాల్లో నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు అత్యంత అవసరం. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. గ్రామాలు నిత్యం సీసీ కెమెరాల పర్యక్షణలో ఉండడం వల్ల నేరాలు, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు అదుపులో ఉండటంతోపాటు శాంతియుత వాతావరణం నెలకొంటుంది. యువత గంజాయి లాంటి చెడు వ్యసనాలకు అలవాటుపడకుండా అరికట్టవచ్చు. ప్రతి గ్రామంలో దాతలు ముందుకువచ్చి కెమెరాల ఏర్పాటుకు పోలీసులకు సహకరిస్తే నేరాలను నియంత్రించవచ్చు.
– యెత్తెపు మధుసూదన్‌రావు, దాత, తుమ్మలపల్లి, చండూరు మండలం