రామగిరి, జూన్ 11: నల్లగొండ పట్టణంలోని మర్రిగూడలో బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో వేదపండితుల మంత్రోచ్ఛారణలతో వైభవంగా నిర్వహించారు. అదే విధంగా ఇదే గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ, ఆంజనేయస్వామి ఆలయాల్లో ధ్వజస్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందుకు బొడ్రాయికి జలాభిషేకం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, కౌన్సిలర్లు ఉట్కూరి వెంకట్‌రెడ్డి, అశ్విని, వట్టిపల్లి శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు గున్రెడ్డి రాధికాయుగేంధర్రెడ్డి, నాయకులు రావుల శ్రీనివాస్‌రెడ్డి, ఆలయాల అభివృద్ధ్ది కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
వైభవంగా రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం
బొడ్రాయి, ధ్వజస్తంభాల ప్రతిష్ఠలో భాగంగా శనివారం రాత్రి రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కల్యాణ తలంబ్రాలను సమర్పించి భక్తిభావం చాటారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వహకులు తెలిపారు.