హుజూర్నగర్ రూరల్, జూన్ 10 ;యేటా వ్యవసాయంలో కౌలు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడి వరి సాగు చేస్తే రెండేండ్లుగా పైసా మిగలకపోగా నెత్తిన ఆర్థిక భారం పడుతున్నది. దాంతో ఈ ఏడాది కౌలు రైతులు కొత్త దారిని ఎంచుకున్నారు. గ్రామాల్లో సంఘాలుగా ఏర్పడి తాము చేస్తున్న భూములకు సంఘం నిర్ణయించిన మేరకే కౌలు ఇచ్చేలా తీర్మానాలు చేసుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధించాలని నిర్ణయించుకున్నారు.
పెరుగుతున్న ఖర్చులు.. తగ్గుతున్న దిగుబడి
కొన్నేండ్లుగా వరి సాగులో ఖర్చు రెండింతలు అయ్యింది. విత్తనాలు, ట్రాక్టర్ దున్నకం, కలుపు, పురుగు మందులు, కూలీలు, వరికోత మిషన్ ఇలా పంట చేతికొచ్చే సరికి ఎకరాకు రూ.28 వేల నుంచి రూ.30వేల వరకు సాగు ఖర్చులు అవుతున్నాయి. గతంలో ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తే.. ఇప్పుడు 20 క్వింటాళ్లకు పడిపోయింది. ఒక్కో సీజన్లో సాగుకు అయ్యే ఖర్చు, పంట వచ్చే దిగుబడికి సమానం అవుతున్నది. రైతులు ఎకరానికి 9 క్వింటాళ్ల ధాన్యం కౌలుగా ఇవ్వాల్సి వస్తుంది. పంట చేతికొచ్చే సమయంలో వాతావరణం అనుకూలించకపోయినా, వర్షాల కారణంగా పంట దెబ్బతిన్నా మరింత నష్టపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో కౌలు రైతులు ఒక్కటై కౌలు తగ్గించాలని నిర్ణయించుకున్నారు.
సంఘాలుగా ఏర్పాటు..
వానకాలం సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో చాలా వరకు గ్రామాల్లో కౌలు రైతులు సంఘాలుగా ఏర్పడి కౌలును నిర్ణయించుకుంటున్నారు. వసతిని బట్టి ఆయా పొలాలకు ఇచ్చే కౌలును నిర్ణయించి కరపత్రాల రూపంలో అందరికీ తెలిసేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని చిలుకూరు, హుజూర్నగర్, గరిడేపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో కౌలు రైతులు వరి పొలాలకు ఎకరానికి వానకాలం 10 బస్తాలు (75కేజీలు), యాసంగికి 8 బస్తాలు ఇచ్చే విధంగా తీర్మానాలు చేసుకున్నారు. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.50 వేల జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.
కష్టానికి తగిన ఫలితం లేదు..
ఇటీవల వరి సాగు ఖర్చులు బాగా పెరిగాయి. కొద్దిపాటి భూమి ఉండి దానికి తోడు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని పంట పండించినా చివరికి ఏమీ మిగలడం లేదు. కూలీల కొరత, పెరిగిన ఖర్చులు, తగ్గిపోతున్న దిగుబడితో కౌలు రైతులు ఏటికేడు నష్టపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పెట్టుబడి సాయం పట్టాదారులకే అందుతున్నది. మేము ఏడాదంతా కష్టపడినా ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేల వరకు నష్టం వస్తున్నది. దాంతో మేము సంఘంగా ఏర్పడి కౌలును నిర్ణయించాం. పండిన పంటలో ఒక వంతు పట్టాదారుకే చెందేలా కౌలును కుదించాం.
– ఉద్దోజు కనకాచారి, లింగగిరి, హుజూర్నగర్ మండలం
రెండేండ్లుగా నష్టం..
నాకు 8 ఎకరాల భూమి ఉంది. మరో 30 ఎకరాల వరకు కౌలుకు తీసుకున్నా. సొంతంగా ట్రాక్టర్ ఉన్నప్పటికీ రెండేండ్లుగా పైసా మిగలడం లేదు. సాగు సమయంలో ఏ చిన్న సమస్య వచ్చినా పూర్తిగా కౌలు రైతు ఎదుర్కోవాల్సి వస్తున్నది. మరో మార్గం లేకపోవడం వల్ల నష్టాలు వచ్చినా సాగు చేస్తున్నాం. ధాన్యం ధర, భూముల విలువ పెరిగిపోయాయని పట్టాదారులు చెపుతూ అధిక కౌలు డిమాండ్ చేస్తున్నారు. కానీ వారు అడిగిన కౌలు ఇవ్వడం వల్ల మాకు ఏమీ మిగలడం లేదు. పైగా నష్టం వస్తున్నది.
– మాడుగుల పరశురాం, బూరుగడ్డ, హుజూర్నగర్ మండలం