శాలిగౌరారం,జూన్ 11: నమ్మిన పాపానికి నట్టేట ముంచారని, తమకు చెందాల్సిన భూమిని తానే పట్టా చేసుకుని నమ్మక ద్రోహం చేశారని నీళ్ల ట్యాంకు ఎక్కింది ఓమహిళ.. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు ట్యాంకుపైనే భీష్మించుకుని కూర్చుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో శనివారం జరిగింది. బాధితురాలి భర్త కనకయ్య, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అడ్లూర్ గ్రామానికి చెందిన దాసరి కనకయ్య ఆయన భార్య నాగమ్మ అదే గ్రామంలో భూపతి సత్తయ్యకు 5-10గుంటల చెందిన భూమిని కొనుగోలు చేసేందుకు 12 యేండ్ల క్రితం ఎకరానికి రూ. 3.70 లక్షల చొప్పున ధర నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అడ్వాన్స్‌గా గ్రామంలో కనకయ్యకు నమ్మకస్తుడైన ఓ వ్యక్తికి మొత్తంగా రూ. 9.80 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. ఈక్రమంలో మిగిలిన డబ్బులు చెల్లించి పట్టా చేసుకుందామనుకున్న తరుణంలో ఆ వ్యక్తి మొత్తం భూమిని కొనేండ్ల క్రితం పట్టా చేసుకున్నాడని ఆరోపించారు.
ఈ భూమి విషయంలో రెండేండ్లుగా పోలీస్‌స్టేషన్, పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీ పెట్టారు. ఈ క్రమంలో శనివారం మండల కేంద్రంలో ఇరువురి పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నడుస్తుండగా తమకు న్యాయం జరుగలేదని మనస్తాపం చెందిన నాగమ్మ సమీపంలోని మంచినీళ్ల ట్యాంకు ఎక్కి ఆత్మహత్య యత్నం చేసుకున్నది. విషయం తెలుసుకున్న శాలిగౌరారం ఎస్ఐ సతీశ్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. గమనించిన నాగమ్మ న్యాయం చేస్తానని హామీ ఇస్తేనే దిగుతానని, అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తి రావాలని.. లేదంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని పలుమార్లు దూకే ప్రయ త్నం చేసింది.
పోలీసులు, స్థానికులు ఎంత వారించినా ససేమిరా అంటూ ట్యాంకు మీదనే కూర్చుంది. పోలీసులు పట్టించుకోకపోవడం కారణంగానే నాగమ్మ ఆత్మహత్య చేసుకునేందుకు పూనుకుందని పలువురు నాయకులు వాగ్వాదానికి దిగారు.
నాగమ్మ ట్యాంకుపై నుంచి రెండు కాళ్లు బయట పెట్టి పలుమార్లు పూనుకోవడంతో నాగమ్మను కిందకు దింపేదుకు పోలీసులు సకల ప్రయత్నాలు చేశారు. వలలు సైతం తెప్పించి సిద్ధ్దంగా ఉంచారు. ఆమెకు కంట పడకుండా యువకులను చాటుమార్గంగా ట్యాంకును ఎక్కించే ప్రయత్నం చేసినప్పటికీ అలాంటి ప్రయత్నాలు చేస్తే దూకి చస్తానని గట్టిగా నాగమ్మ వారించడంతో పోలీసులు వెనుకడుగు వేశారు. ఫైర్ ఇంజిన్ సైతం సిద్ధ్దంగా ఉంచారు.