కాలం మారింది. పల్లెలు -పట్టణాలకు అంతరం తగ్గుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు అనుకూలించి భూములకు డిమాండ్ పెరిగింది. పల్లె ప్రజల ఆర్థిక స్థ్థితి మెరుగు పడడంతో గ్రామాల్లోనే పట్టణ వాతావరణాన్ని సృష్టించుకుంటున్నారు. అత్యాధునితతో కూడిన భవనాలు, ఇండ్లు నిర్మించుకుంటున్నారు. ఇక ఆకర్షణీయంగా ఫంక్షన్ హాళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. జాతీయ రహదారుల వెంట ఉన్న గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా పెద్ద భవనాలు, దుకాణా సముదాయాలు వెలుస్తున్నాయి. రోడ్డు డివైడర్ల మధ్యలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో రాత్రి వేళ గ్రామాలు ధగధగ మెరిసిపోతున్నాయి.
అనుకూలిస్తున్న వాతావరణం
గ్రామాల్లోనూ లక్షలు వెచ్చించి ఇండ్లు నిర్మించుకోవడానికి ఎవరూ వెనుకాడడం లేదు. వాతావరణం అనుకూలించి పంటలు బాగా పండడం, రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్‌తోపాటు రైతు సంక్షేమ పథకాలు అందిస్తుండడంతో పంటల సాగు పెరిగింది. అధిక దిగుబడులు రావడంతో రైతులకు లాభాలు అందివస్తున్నాయి. దాంతో వ్యవసాయం పండుగలా మారింది. వలస వెళ్లిన రైతులు, కూలీలు సైతం స్వగ్రామాలకు రావడంతో పల్లెలకు పూర్వ వైభవం వచ్చింది. కొవిడ్ ప్రభావంతో పట్టణాల్లో ఉండే వారు కొంత మంది గ్రామాలకు రాగా ఇక్కడే ఉంటూ ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. దాంతో పాత ఇండ్లను కూల్చివేసి కొత్తగా నిర్మించుకుంటున్నారు. ఇక ఇంటికో బైక్ తప్పనిసరిగా ఉంటున్నది. ఆర్థిక స్తోమత ఉన్న వారు కార్లు కూడా కొంటున్నారు.
గ్రామాల్లోనూ ఫంక్షన్ హాళ్లు
ఒకప్పుడు పల్లెల్లో వివాహాది శుభకార్యాలు చేయాలంటే తాటి ఆకులతో ఇంటి ముంగిట పందిరి వేసేవారు. వాటిని రంగు కాగితాలు కత్తిరించి అంటించే వారు. పెండ్లి ఇల్లు అనగానే గుర్తు ఉండేలా తోరణాలతో నెల రోజులపాటు ఇంటి ముంగిట పందిరి ఉండేది. కానీ నేడు వివాహ వేడుకల తీరు మారి పోయింది. గ్రామాల్లోనూ ఫంక్షన్ హాళ్లు ఏర్పాటయ్యాయి. అత్యాధునిక వసతులు, విశాలమైన ప్రదేశంలో నిర్మించి వేడుకలకు కావాల్సిన అన్నీ సమకూర్చుతున్నారు. దాంతో వాటికి సైతం గిరాకీ పెరుగడంతో నేడు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి.

పల్లె ప్రగతితో మారిన స్వరూపం
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో చేపడుతున్న కార్యక్రమాలతో గ్రామ రూపురేఖలే మారిపోతున్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికీ మంచినీటి పైపులైన్లు ఏర్పాటయ్యాయి. దాంతో పల్లెల్లో అత్యాధునిక సౌకర్యాలతో ఇండ్లను నిర్మించుకుంటున్నారు. బ్యాంకులు కూడా గ్రామాల్లో ఇండ్ల నిర్మాణానికి రుణాలు విరివిరిగా ఇస్తున్నాయి. వాటిని వినియోగించుకొని బహుళ అంతస్తుల భవనాలను పట్టణాలను తలదన్నే రీతిలో నిర్మించుకుంటున్నారు.
కండ్లు చెదిరే నిర్మాణాలు
సింగిల్, డబుల్ బెడ్రూం ఇండ్లను విత్ అటాచ్ బాత్రూమ్, సీలింగ్, కబోర్డు, గ్రానైట్ బండలు, ఎల్ఈడీ లైట్లు, ఇంటీరియర్ డిజైన్స్‌తో నిర్మించుకుంటున్నారు. భారీస్క్రీన్తో ఎల్ఈడీ టీవీలు, ఏసీలు పెట్టించుకుంటున్నారు. పట్టణంలో ఉండే ఉద్యోగులు, వ్యాపారులు తమ సొంత గ్రామాల్లో గెస్ట్ హౌస్, ఫాంహౌస్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారాంతం, సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో వచ్చి గడుపుతున్నారు. వీటి నిర్మాణాలు ఇప్పుడు బాగా పెరిగాయి.
పచ్చదనం.. పరిశుభ్రంతో కొత్తరూపు
గతంతో వర్షం వచ్చిందంటే గ్రామాల్లోని వీధులు బురద మయంగా మారేవి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పల్లెలు కొత్త శోభ సంతరించుకుంటున్నాయి. మట్టి రోడ్లన్నీ సీసీగా మారుతున్నాయి. డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. రోడ్ల విస్తరణతో ప్రధాన రహదారుల వెంట ఉన్న గ్రామాలు పట్టణాలను తలదన్నే రీతిలో రూపుదిద్దుకున్నాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు వెలుస్తున్నాయి.
ఇక హరితహారంతో పచ్చని చెట్లు కళకళలాడుతుండగా గ్రామానికో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, క్రీడాప్రాంగణాలతో కొత్తదనం వచ్చింది.
ఆధునికత వైపు మొగ్గు
గ్రామాల ప్రజలు ఆధునికత వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయి. అంతేకాకుండా పల్లె ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇప్పుడు అన్ని హంగులతో కొత్త ఇండ్లు నిర్మించుకుంటున్నారు.
-బి.నాగలక్ష్మి, గూడూరు, మిర్యాలగూడ మండలం
పెండ్లిండ్లకు తప్పిన ఇబ్బందులు
ఇంటి వద్ద వివాహం చేయాలంటే పందిరి వేయాలి. టెంట్, డెకరేషన్ తదితర వసతులన్నీ సమకూర్చుకోవాలి. కొంత డబ్బు ఖర్చు అయినా ఫంక్షన్ హాళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇప్పుడు గ్రామాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయడం బాగుంది. ఈ కాలంలో ప్రతి ఒక్క కుటుంబం ఉన్నతంగా బతుకున్నది. వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడానికి ఫంక్షన్ హాళ్లను వినియోగించుకుంటున్నారు.
-బాణావత్ లలిత, చింతపల్లి, మిర్యాలగూడ మండలం
ఊళ్లు ఎంతో మారినయ్
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గ్రామాలకు మహర్దశ వచ్చింది. ముఖ్యంగా వీధుల్లో ఎల్ఈడీ లైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ,పారిశుధ్యం పట్ల ప్రత్యేక దృష్టి, ఇంటింటికీ కృష్ణా వాటర్, మరుగు దొడ్డి, ఇంకుడు గుంతల నిర్మాణం, హరితహారంతో పచ్చని చెట్లు, పల్లె ప్రకృతి వనం గ్రామాలకు వరాలుగా మారాయి. పల్లెలు పట్టణాలను మైమరపిస్తున్నాయి
-లావూడి చావలి, సర్పంచ్ లావూడితండా