వ్యవసాయంపై ఆధారపడే రైతుల సంఖ్యతోపాటు సాగు ఖర్చులు కూడా నానాటికీ పెరుగుతున్నాయి. దాంతో సాగు అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పెట్టుబడిని తగ్గించుకుంటూ రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే సూచిస్తున్నది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి నిచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలి ? ఏయే పద్ధతులు పాటించాలి? అనే విషయమై తిరుమలగిరి మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు సలహాలు, సూచనలు.
సమయం ముఖ్యం
దుక్కి దున్ని ఎరువులు సమయానికి వేసి నాణ్యమైనవిత్తనాన్ని వాడినా సమయానుకూలంగా ఆశించిన దిగుబడిరాదు. ఫలితంగా దున్నడం ఖర్చు, ఎరువుల ఖర్చు మీదపడే అవకాశం ఉంది. విత్తనాలను నిర్దేశించిన మేరకు సరైన దూరంలో వేయాలి. సీజన్ ముగిసిన తర్వాత విత్తనాలు వేస్తే ఖర్చు పెరుగుతుందే గానీ దిగుబడి మాత్రం పెరుగదు. భూమిలో తగిన తేమ ఉంటేనే విత్తనాలు వేయాలి. వరి పంటకు నీరు రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంటే నేరుగా విత్తనాలను వెదజల్లే పద్ధతి పాటించాలి. దీనివల్ల నారుమడిని పెంచకుండా నారు పెంచడానికి అయ్యే ఖర్చులు తగ్గించుకోవచ్చు.
సొంత విత్తనాలే మేలు
రైతులు విత్తనాల కోసం ప్రైవేటు కంపెనీలపై ఆధార పడుతున్నారు. అలా కాకుండా రైతులే స్వయంగా తయారు చేసుకోవాలి. ప్రతి రైతూ తనకు కావాల్సిన విత్తనాలను 10 నుంచి 20 గుంటల విస్తీర్ణంలో వేసుకోవడం మంచిది. అధిక దిగుబడినిచ్చే గుర్తింపు పొందిన విత్తనాభివృద్ధి సంస్థ సేకరించిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. పిలక, వెన్నుదశ, గింజపాలు పోసుకునే సమయంలో పొలంలో కల్లీ మొక్కలు కనిపిస్తే తొలగించాలి. పంటను కోసి ఇతర రకాలు కలుపకుండా బాగా ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా విత్తనాలు తయారు చేసుకుంటే ఖర్చు భారీగా తగ్గుతుంది.
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
సకాలంలో పంటల్లో కలుపు తీత, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తేలికపాటి నేలల్లో దుక్కిదున్నితే కలుపు నివారించవచ్చు. తద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. మొదటి దఫా కలుపు తప్పనిసరిగా విత్తనం మొలకెత్తిన నెలలోపు తొలగించాలి. దీనివల్ల పంట మొక్కలు దట్టంగా పెరుగుతాయి. ప్రధాన పంటగా పెసర, మినుము, కంది, అలసంద వంటి పప్పు జాతి పంటలను అంతరపంటగా సాగు చేస్తే రెండు పంటల్లో అధిక దిగుబడి సాధించవచ్చు. ఇలా పంటల సాగు చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చు.
సేంద్రియ ఎరువులు వాడాలి
రైతులు రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులను ఎక్కువగా వాడటం వల్ల మొక్కల్లో కనిపించే సూక్ష్మధాతు లోపాలను నివారించవచ్చు. భూమి సారవంతంగా తయారవుతుంది. నేల గుల్లబారి నీటిని నిలుపుకొనే శక్తి పెరిగి మొక్క వేళ్లకు నీరు, గాలి బాగా అందుతుంది. సేంద్రియ ఎరువుల్లో కంపోస్టు, పశువుల ఎరువు, జనుము, జీలుగు, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్లతోపాటు వేపపిండి, వేరుశనగ చెక్కలను ఉపయోగించడం వల్ల దిగుబడులను పెంచుకోవచ్చు. ఒకవేళ రసాయన ఎరువులు అవసరం ఉండి పంటకు వాడాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పైపాలుగా ఎరువులు వేసే ముందు పొలంలోని నీటిని పూర్తిగా తీసి ఆ తర్వాత యూరియా వంటి ఎరువులను వేసి తిరిగి రెండు రోజులకు నీరు పెట్టాలి. యూరియా వేసిన ప్రతిసారి ఐదు కిలోల యూరియాకు కిలో వేపపిండిని కలిపితే యూరియా వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వరినాట్లు పూర్తయిన 20 రోజుల తర్వాత కాంప్లెక్స్ ఎరువులను ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. ఎకరాకు సిఫారసు చేయబడిన ఎరువుల్లో నత్రజని 32 కిలోలు, భాస్వరం 16 కిలోలు, జింకు 12 కిలోలు ఉండేలా చూసుకోవాలి.
తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి
ప్రతి పంటలో తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేసినట్లయితే పురుగు మందుల వాడకాన్ని సగానికి సగం తగ్గించవచ్చు. దీనివల్ల ఖర్చు తగ్గి అధిక దిగుబడులతోపాటు ఎక్కువ ఆదాయం పొందవచ్చు. విత్తనం దశలో నిర్లక్ష్యం చేస్తే పంట మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. కిలో విత్తనాన్ని 2.5 గ్రాముల కార్బండిజమ్తో శుద్ధి చేయాలి. విత్తన శుద్ధి చేసినట్లయితే దాదాపు నెలరోజుల వరకు మొక్కలకు తెగుళ్లు ఆశించవు. విత్తన శుద్ధి చేసేటప్పుడు విత్తనం పైపొర ఊడిపోకుండా చూసుకోవాలి.