నల్లగొండ ప్రతినిధి, జూన్ 8(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు సైతం భాగస్వాములు అవుతుండడంతో ఎక్కడ చూసినా సందడి కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అవాస ప్రాంతాలను సైతం కలుపుకుని విజయవంతంగా కొనసాగుతున్నది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను తొలిరోజు లాంఛనంగా ప్రారంభించగా, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలంతా నేతృ త్వం వహిస్తూ నడిపిస్తున్నారు.
ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు
సూర్యాపేట జిల్లా పరిధిలోని ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండ లం భీమారంలోనూ పల్లె ప్రగతి కార్యక్రమంలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేకంగా పాల్గొన్నారు. గ్రామ సభల్లో మంత్రులు పాల్గొంటూ ప్రజలంతా భాగస్వాములై పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. రోడ్లను శుభ్రపర్చడం, డ్రైనేజీ క్లీనింగ్, ప్రభుత్వ సంస్థల క్లీనింగ్, పాత బావుల, బోరు గుంతలను పూడ్చటం, శ్రమదానం, మొక్కల పెంపకం కోసం స్థలాలను గుర్తించడం, రోడ్లపై గుంతలను చదును చేయడం, అన్ని రకాల విద్యుత్ సమస్యలను పరిష్కరించడం, వైకుంఠధామాల్లో కరెంటు, నీరు, టాయిలెట్ వసతులు కల్పించడం ఇలా అనేక కార్యక్రమాలను ఐదో విడుత పల్లె ప్రగతిలో చేపడుతున్నారు.
పరిశుభ్రతకు పెద్ద పీట…
ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో పారిశుధ్య నిర్వహణకు, రోడ్లు, ప్రభుత్వ భవనాల శుభ్రతకు పెద్దపీట వేస్తూ ఈ ఆరు రోజుల్లో పల్లె ప్రగతి కొనసాగుతున్నది. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 2,520 కిలోమీటర్లకుగానూ 2,502 కిలోమీటర్ల మేర రోడ్లను శుభ్రపరిచారు. ఇక సూర్యాపేట జిల్లాలోనూ 1956కి.మీ. గానూ 1,333 కి.మీ. మేర, యాదాద్రి జిల్లాలో 1,557 కిలోమీటర్ల మేర వందశాతం రోడ్లను శుభ్రం చేశారు. వీటితో పాటు డ్రైనేజీ, మురుగు కాల్వలను సైతం శుభ్రం చేశారు. నల్లగొండ జిల్లాలో 1,964 కిలోమీటర్లకుగానూ 1,591 కి.మీ.మేర డ్రైనేజీలను శుభ్రపరిచి మురికినీరు సక్రమంగా పారేలా చర్యలు చేపట్టారు. ఇక సూర్యాపేట జిల్లాలో 1,168 కి.మీ.గానూ 792 కి.మీ. మేర, యాదాద్రి జిల్లాలో 1,159 కి.మీ. గానూ వందశాతం డ్రైనేజీ వ్యవస్థలో ఆటంకాలు లేకుండా పారిశుధ్య పనులు చేపట్టారు. ఇక గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలు,కమ్యూనిటీ భవనాల లాంటి ప్రభుత్వ భవనాల ఆవరణాలను సైతం శుభ్రపరిచారు.
పాత బావులు, బోరు గుంతల పూడ్చివేత..
పాత బావుల, బోర్లు తవ్వాక వదిలేసిన రంధ్రాలను కూడా పల్లె ప్రగతిలో భాగంగా అత్యంత ప్రాధాన్యతనిస్తూ పూడ్చివేస్తున్నారు. మొదటి ఆరు రోజుల్లో నల్లగొండ జిల్లాలో 58 పాతబావులను గుర్తించి 43 పూడ్చివేశారు. 92 బోరు రంధ్రాలకు గానూ 21 చోట్ల మూసివేశారు. సూర్యాపేట జిల్లాలో 79 పాతబావులకు గానూ 50, 110 బోరు రంధ్రాలకు గానూ 13 పూడ్చి వేసినారు. యాదాద్రి జిల్లాలో 13 పాతబావులకు 13, 71 వృథా బోరు రంధ్రాలకుగాను రెండు చోట్ల మూసివేసి జాగ్రత్తలు తీసుకున్నారు. నల్లగొండ జిల్లాలో 620 చోట్ల 16,718 మంది ప్రజల భాగస్వామ్యంతో శ్రమదానాలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో 289 చోట్ల 3,697 మంది, యాదాద్రి జిల్లాలో 440 చోట్ల 1,926 మంది భాగస్వామ్యంతో శ్రమదాన కార్యక్రమాలు కొనసాగినట్లు అధికారులు లెక్కలు వెల్లడించారు.
కరెంటు మరమ్మతులు…
పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా ప్రత్యేకంగా కరెంటు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గ్రామాల్లో శిథిలమైన స్తంభాలను మార్చడం, వేలాడే వైర్లను సరిచేయడం, వీధిదీపాల కోసం మూడో వైర్‌ను అమర్చడం, కరెంటు మీటర్లు బిగించడం, ఇండ్ల మీద నుంచి వెళ్తున్న లైన్లను మార్చడం లాంటి పనులకు పెద్దపీట వేస్తున్నారు. అయితే ఈ పనుల నిర్వహణలో సంబంధిత కాంట్రాక్టర్లే చేయాల్సి రావడంతో వీరు ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతంలో వీటిని చేపడుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లాలో 64 చోట్ల థర్డ్ వైర్ సమస్యను పరిష్కరించి 41 కొత్త స్తంభాలను పాతారు. సూర్యాపేట జిల్లాలో 134 చోట్ల థర్డ్ వైర్ సమస్యను క్లియర్ చేసి 157 కొత్త పోల్స్‌ను ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లాలో ఏడు చోట్ల థర్డ్‌వైర్ సమస్యకు చెక్‌పెట్టి కొత్త పోల్స్ వేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
ముళ్ల పొదల తొలగింపు.. గుంతల పూడ్చివేత
ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రగతిలో ఆవాస ప్రాంతాల్లో పేరుకుపోయిన ముళ్లపొదలను తొలగిస్తూ రోడ్లపై గుంతలను పూడ్చుతూ లోతట్టు ప్రాంతాల్లో మట్టి తోలుతున్నారు. నల్లగొండ జిల్లాలో 2,351 స్థలాల్లో ముళ్లపొదలు, సర్కార్ తుమ్మలను తొలిగించాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటివరకు 1,798 చోట్ల పూర్తి చేశారు. ఇక 1,912 రోడ్లపై గుంతలకు గానూ 850 చోట్ల పనులు పూర్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లో 1,873 చోట్ల మట్టి నింపాలని టార్గెట్‌గా పెట్టుకుని 743 చోట్ల నింపేసారు. ఇదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 3018 ముళ్లపొదలు, సర్కార్తుమ్మ స్థలాలకు గానూ 1429 చోట్ల క్లియర్ చేశారు. 1172 చోట్ల రోడ్లపై గుంతలకుగానూ 420 పూడ్చివేశారు. 947 లోతట్టు ప్రాంతాల్లో 285 చోట్ల మట్టిని నింపి చదును చేశారు. యాదాద్రి జిల్లాలో 2,273 ముళ్లపొదలకు గానూ 1,877 క్లీన్ చేశారు. 599 చోట్ల గుంతలు ఉన్నట్లు గుర్తించి 309 చోట్ల పూడ్చివేశారు. ఇక 326 చోట్ల లోతైన ప్రదేశాలను గుర్తించి 115 చోట్ల మట్టితో నింపేశారు.
వైకుంఠధామాల్లో మౌలిక వసతుల కల్పన
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న అన్ని వైకుంఠధామాల్లోనూ మిగిలిపోయిన వాటిల్లో వసతుల కల్పనపై ఈసారి పల్లె ప్రగతిలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా వైకుంఠధామాల్లో కరెంటు సరఫరా, నీటి వసతి, టాయిలెట్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలోని 183 వైకుంఠధామాల్లో కరెంటు కనెక్షన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని 25 చోట్ల పూర్తి చేశారు. 118 చోట్ల నీటి వసతికి గానూ 50 చోట్ల పూర్తి చేశారు. 79 చోట్ల టాయిలెట్ల వసతికి గానూ 32 చోట్ల ఇప్పటికే పూర్తి చేశారు. సూర్యాపేట జిల్లాలోనూ 208 చోట్ల కరెంటు సౌకర్యానికి గానూ 18చోట్ల, నీటి వసతిలో 162 చోట్లకుగాను 11 చోట్ల, టాయిలెట్ల విషయంలో 88 వైకుంఠ ధామాలకుగానూ 75 చోట్ల పనులు పూర్తి చేశారు. యాద్రాది జిల్లాలో 255 వైకుంఠధామాల్లో కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా రెండు చోట్ల, 156 చోట్ల నీటివసతి కల్పనకు గానూ ఏడు చోట్ల పనులు పూర్తి చేశారు.
మొక్కల పెంపకానికి స్థలాల గుర్తింపు
పల్లె ప్రగతిలో భాగంగా హరితహారం కార్యక్రమానికి పెద్దపీట వేస్తున్నారు. మొక్కలు పెంపకానికి అనువైన స్థలాలతో పాటు రహదారులను గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో 515 కిలోమీటర్ల పొడవున రహదారుల వెంట అవెన్యూ ప్లాంటేషన్ కోసం స్థలాలను గుర్తించారు. 53 చోట్ల మెగా పల్లె ప్రకృతి వనాల పెంపకానికి స్థలాలను ఎంపిక చేశారు. సూర్యాపేట జిల్లాలో 387 కిలోమీటర్ల రహదారులను, 83 మెగా ప్రకృతి వనాల పెంపు స్థలాలను గుర్తించారు. యాదాద్రి జిల్లాలో 281 కిలోమీటర్ల మేర రహదారులను, 25 మెగా ప్రకృతి వనాల పెంపునకు అనువైన స్థలాలను మొక్కల పెంపకం కోసం ప్రత్యేకంగా గుర్తించారు. ఇక ఇవేకాకుండా తెలంగాణ క్రీడా మై దానాలకు స్థలాల గుర్తింపు, చదును చేయడం, ప్రారంభించడానికి కూడా ఈ పల్లె ప్రగతిలో అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో పాటు మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం నెంబర్ వన్
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
చిట్యాల, జూన్ 8 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మన ఊరు-మన బడి పథకం ద్వారా ఉన్నత పాఠశాలలో రూ.38 లక్షలతో, గ్రామంలో రూ.20 లక్షలతో సీసీ రోడ్ల పనులకు బుధవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామస్తుల కోరిక మేరకు అభివృద్ధి పనుల కోసం తన నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొలను వెంకటేశ్, సర్పంచ్ బోయపల్లి వాణి, ఎంపీటీసీ ఉప్పరబోయిన అంజమ్మస్వామి, పీఏసీఎస్ చైర్మన్ రుద్రారం భిక్షపతి, ఉప సర్పంచ్ ఆవుల రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆవుల అయిలయ్య, ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, నాయకులు కర్నాటి ఉప్పల్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు ఈసం బాబు, కక్కిరేణి బొందయ్య, దేవరపల్లి సత్తిరెడ్డి, గంగాపురం భాస్కర్, స్వామి, ముద్దసాని రమణారెడ్డి, రాచకొండ కృష్ణయ్య పాల్గొన్నారు.