మిర్యాలగూడ, జూన్ 8 : మిర్యాలగూడ పట్టణంలో కొంత మంది స్నేహ సమాఖ్య పేరుతో లక్షల రూపాయలు సేకరించారు. డిపాజిట్ల గడువు ముగిసి నాలుగేండ్లు గడిచినా సభ్యులకు డబ్బులు చెల్లించక పోవడంతో బాధితులు బుధవారం సంస్థ కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన వెంకటేశ్వర్లు, లీలావతి, జయిని భిక్షం, శంకర్ 1994లో మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడలో ‘స్నేహ పరస్పర సహాయక సహకార, పొదుపు మరియు పరపతి సంఘం’ పేరుతో సంస్థను స్థాపించారు. సంస్థ పరిధిలో ప్రగతి, స్నేహ పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి వందలాది మంది మహిళలను సభ్యులుగా చేర్చుకున్నారు. ప్రతి సభ్యురాలి నుంచి నెలనెలా రూ.100 చొప్పున వసూలు చేసేవారు. ఈ డబ్బులను డిపాజిట్ల రూపంలో తీసుకొని బాండ్లు జారీ చేయడం, కావాల్సిన వారికి రుణాలు ఇవ్వడం చేశారు. 2015 నుంచి సంస్థ నగదు చెల్లింపుల్లో జాప్యం చేస్తున్నారు. చాలా మంది సభ్యుల డిపాజిట్ గడువు ముగిసి నాలుగేండ్లు దాటినా నగదు చెల్లించడం లేదు. దాంతో గత నెల 22న స్థానిక కౌన్సిలర్ పత్తిపాటి సంధ్యానవాబ్ సారథ్యంలో బాధితులు నిర్వాహకులపై ఒత్తిడి తేగా డబ్బులు చెల్లించేందుకు గడువు పెట్టారు.
గడువు ముగిసినా నిర్వాహకులు స్పందించక పోవటంతో బాధితులు బుధవారం సంస్థ కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. సంస్థ నిర్వాహకులైన కుందూరు కృష్ణవేణి, వెంకటేశ్వర్లు, జయిని భిక్షంపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంస్థ నుంచి సుమారు రూ.30 లక్షల వరకు తమకు రావాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పాటు పట్టణంలో 30 నుంచి 40 వరకు సంఘాలు ఏర్పాటు చేసి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, ఆరేండ్లలో రెట్టింపు సొమ్ము ఇస్తామని భారీగా డిపాజిట్లు సేకరించారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పిల్లల పెండ్లిళ్లు, భవిష్యత్ అవసరాల కోసం తాము దాచుకున్న మొత్తాన్ని దోచుకున్నారని, న్యాయం చేయాలని పోలీసులను కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.