మిర్యాలగూడ రూరల్, జూన్ 8 : వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత హెచ్చరించారు. బుధవారం మిర్యాలగూడ పట్ట ణంలోని విత్తన విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విత్తనాలు అమ్మే వారు లైసెన్స్ కలిగి ఉండాలని, స్టాక్ బోర్డు ప్రదర్శించాలని, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. డీలర్లు ప్రతి నెలా 5వ తేదీ లోపు ఫారం -డీలో తమ విక్రయ వివరాలు పొందుపర్చాలన్నారు. రైతులు లైసెన్స్ కలిగి ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని, రసీదు తప్పక తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట ఏడీఏ పోరెడ్డి నాగమణి, వ్యవసాయ అధికారి బి.కల్యాణ్‌చక్రవర్తి, ఎండీ. షరీఫ్, ఏఈఓలు రమేశ్, సైదులు, స్వేత, హిమబిందు, డీలర్లు ఉన్నారు.
రైతులకు అందుబాటులో విత్తనాలు
మాడ్గులపల్లి : రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన అధికారుల సమావేశంలో మాట్లాడారు. వేములపల్లి, మాడ్గులపల్లి పీఏసీఎస్‌లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వానకాలం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మండల ఇన్చార్జి ఏఓ రుష్యేంద్రమణి, ఏఈఓలు దేవా, స్వాతి, వేణుగోపాల్ పాల్గొన్నారు.