భక్తుల కొంగుబంగారంగా కనగల్ మండలం దర్వేశిపురంలోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారు ప్రసిద్ధి చెందింది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల నీరాజనాలు అందుకుంటున్నది. నల్లగొండ పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయం దేవదాయ శాఖ పరిధిలో ఉంది. ఆలయం సీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు మారి ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నది.
– కనగల్, జూన్ 7
వారంలో మూడు రోజులు సందడే
ఆలయానికి ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో భక్తులు ఎక్కువగా తరలివస్తారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని కుటుంబ, బంధు, మిత్ర సమేతంగా విందు భోజనాలు చేసి వెళ్తారు. ఇక్కడ తమ కోరికలు తెలియజేయడానికి భక్తులు కొబ్బరికాయలు ముడుపులు కడుతుంటారు. కోరికలు తీరగానే ఆ ముడుపులు అమ్మవారికి చెల్లిస్తారు. ఏటా మే, జూన్ నెలల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత దర్వేశిపురం ఆలయం వద్ద పుష్కరఘాట్ నిర్మించగా 10లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించారంటే అమ్మవారిపై భక్తులకు ఉన్న నమ్మకం తెలుసుకోవచ్చు.
12 వరకు ఉత్సవాలు
నేటి నుంచి 12 వరకు రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలను కనుల పండువగా నిర్వహించనున్నారు. ఈ నెల 8న నిత్యపూజలు, 9న అమ్మవారికి శేషవాహన సేవ, 10న ఉదయం 7:35 గంటలకు ఆలయం ఎదుట హంపీ పీఠాధిపతి విద్యారణ్య మహాస్వామితో ధ్వజస్తంభం ప్రతిష్ఠ, ఉదయం 9గంటలకు ఎదుర్కోళ్లు, 10: 35గంటలకు రేణుక ఎల్లమ్మ, జమదగ్ని మహాముని కల్యాణోత్సవం జరుపనున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టనున్నారు. 11న ఉదయం అమ్మవారికి 108 కలశాలతో అష్టోత్తర శతఘాటాభిషేకం, సాయంత్రం 3గంటలకు గ్రామోత్సవం, 12న సాయంత్రం 4గంటలకు దర్వేశిపురం, పర్వతగిరి గ్రామస్తులచే బోనాలు తీస్తారు. ఒగ్గు కళాబృందంతో ఎల్లమ్మ చరిత్ర, 8, 9, 10, 11, 12 ఒగ్గు కథ, చామలపల్లి అంజయ్య కళా బృందంతో కోలాటాల ప్రదర్శనలు నిర్వహిస్తారు. తాగునీరు, పారిశుధ్య నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ నల్లబోతు యాదగిరి, ఆలయ ఈఓ జల్లేపల్లి జయరామయ్య తెలిపారు. కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నట్లు చెప్పారు.
ధ్వజస్తంభం ఊరేగింపు
దర్వేశిపురంలో మంగళవారం ధ్వజస్తంభం ఊరేగింపును డప్పుచప్పుళ్లు, కోలాట బృందాలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ నల్లబోతు యాదగిరి, అర్చకులు నాగోజు మల్లాచారి, శ్రవణాచారి, సర్పంచ్ అల్గుబెల్లి పూలమ్మ, నర్సింహారెడ్డి, కంచర్లకుంట్ల గోపాల్‌రెడ్ది, నర్సింహ, జినుకుంట్ల అంజయ్య, భుక్క అంజయ్య, రాంబాబు, అశోక్, నాగేశ్ పాల్గొన్నారు.