పంటలు పండించాలంటే సాగులో మెళకువలే కాదు.. సరైన నేల ఉండాలి. వీటితోపాటు సాగు విధానాలు పాటిస్తే రైతుల ఇంట సిరుల పంటే. నల్లగొండ జిల్లాలో సాగుకు అనుకూలమైన భూములు ఉన్నాయి. ఇందులో అన్ని రకాల పంటలు సాగు చేసుకోవచ్చు. జిల్లాలో ఎక్కువగా ఎర్ర నేలలు ఉన్నాయి. వీటితోపాటు నల్లరేగడి, ఇసుక నేలలు ఉన్నాయి. యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిగ దిగుబడులు పొందొచ్చు.
– యాదాద్రి, జూన్7
పోషక లోపాలను గుర్తించాలి
మన నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉంటుంది. దీనిని సరిచేయడానికి పచ్చిరొట్ట ఎరువులు వాడాలి. సూక్ష్మపోషకాల లోపాలు కూడా ఉన్నాయి. నత్రజని వాడకాన్ని సగానికి తగ్గించవచ్చు. దీని వల్ల ఖర్చు తగ్గడమేకాక నేలను పరిరక్షించవచ్చు. 60 శాతం బోరుబావులు చాలా లోతు నుంచి నీళ్లు తోడడం వల్ల లవణాలు పైకి వచ్చి నేలపై పొరగా ఏర్పడి దిగుబడులు తగ్గుతాయి. దీంతో ఏ నేలల్లో ఏ పంట ఏ సమయంలో వేయాలో రైతులు అవగాహన కలిగి ఉండాలి. చాలామంది రైతులు ఏ భూమిలో ఏ పంట వెయ్యాలో తెలియక, ఆ నేలలో పండని పంటను వేసి దిగుబడి రాక నష్టపోతూ ఉంటారు. లాభాలు మాట అటుంచితే పెట్టిన పెట్టుబడి కూడా రాదు.
ఎర్ర నేలలు
అగ్ని శిలలైన గ్రానైట్ శిలలు క్రమక్షయం చెంది ఎర్ర నేలలుగా ఏర్పడతాయి. ఈ నేలల్లో ఉండే ఫెర్రస్ ధాతువు కారణంగా ఇవి ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఈ నేలల్లో సాధారణంగా ఒండ్రుశాతం తక్కువగా, ఇసుక పరిమాణం అధికంగా ఉంటుంది. దీంతో నేలలు వర్షాలకు తడిసినప్పుడు ఒదులు అవుతాయి. లెగ్యుమినస్ జాతికి చెందిన, వేర్లు అధికంగా ఉండే పంటలకు ఇవి అనుకూలమైనవి. ఎర్ర నేలలు పప్పుధాన్యాల పంటలకు సాగుకు అనుకూలం. నీటి వసతి కల్పించినట్లయితే ఈ నేలల్లో కూడా వరి, గోధుమ, చెరకు, జొన్న వంటి పంటలను సైతం పండిచవచ్చు.
నల్లరేగడి నేలలు
అగ్ని శిలలైన బసాల్ట్ శిలలు క్రమక్షయం చెంది నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. ఈ నేలల్లో ఇనుప ధాతువు, మెగ్రీషియం ఆక్సైడ్ అధికంగా ఉండటం వల్ల ఇవి నలుపురంగులో కనిపిస్తాయి. ఈ మూలకాలతో పాటు సున్నం, పొటాష్ చెప్పుకోదగిన పరిమాణంలో ఉంటాయి. ఈ నేలల్లో పాస్పరస్, నైట్రోజన్, జీవసంబంధాల పదార్థాలు తక్కువ. వీటిని రేగడి నేలలు అని కూడా పిలుస్తారు. ఈ నేలలు పత్తిపంటకు అనుకూలంగా ఉండటం వల్ల వీటిని పత్తి నేలలు అనికూడా పిలుస్తారు. ఇవి నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు పగుళ్లు చూపుతాయి. అందువల్ల వీటిని తమని తాము దున్నుకునే నేలలు అని కూడా పిలుస్తారు. ఈ నేలలకు తేమను అధిక కాలంపాటు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది.
మూడు రకాల నేలలు..
నల్లగొండ జిల్లాలో మూడు రకాల నేలలు నల్ల రేగడి, ఎర్ర, ఇసుక నేలలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఎర్ర నేలలు అధికంగా 9,58,922 ఎకరాల్లో ఉన్నాయి. నల్లరేగడి నేలలు 1,41,922 ఎకరాల్లో, ఇసుక నేలలు 4,92,365 ఎకరాల్లో, చౌడు నేలలు 1,10,035 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. నీటి నిల్వ సామర్థ్యం, పోషకాల లభ్యత నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది.
వరి..
వరి పంటను అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయొచ్చు. మరుగు నీరు బయటికి పోయే వసతి ఉన్న బరువు నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆరుతడి పంటలతో పోలిస్తే వరికి చౌడు నేలలు కొంత మేర అనుకూలమే. జూన్ నుంచి ఆగస్టు వరకు వరి పంట వేసుకోవాలి
మొక్కజొన్న..
మొక్కజొన్న పండించడానికి నీరు ఎక్కువగా ఉండే ఒండ్రు నేలలు, బరువు నేలలు పనికిరావు. కాబట్టి మొక్కజొన్నను నీరు తక్కువగా నిలిచే ఇసుక, రేగడి, గరప నేలల్లో సాగు చేయవచ్చు. ఎర్ర గరప నేలలు, లోతైన మధ్య రకపు రేగడి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. పేలాల మొక్కజొన్న రకాన్ని తేలికపాటి ఇసుక భూముల్లో వేసుకోవచ్చు. తడి ఉన్న సమయంతోపాటు జూన్ 15 నుంచి జూలై 15 వరకు వేసుకోవాలి.
పత్తి..
వర్షాదారపు పత్తిని నల్లరేగడి నేలల్లో సాగు చేయవచ్చు. తేలికపాటి ఎర్ర నేలలు పనికిరావు. నీటి పారుదల కింద తేలికైన ఎర్ర నేలలు, బరువైన నల్ల నేలలు పత్తిని పండించడానికి అనుకూలంగా ఉంటాయి. జూన్ మొదటి వారం నుంచి జూన్ 31 వరకు పత్తి వేసుకుంటే అధిక లాభాలు గడిస్తారు.
మినుము
మురుగు నీటి పారుదల వసతి ఉన్న ఎర్ర, నల్ల నేలలు మినుము, సోయా చిక్కుడు పంటకు అనుకూలంగా ఉంటాయి. నీరు ఇంకే, తేమను నిల్వ చేసుకునే భూముల్లో సాగు చేయడం ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చు. వరికోత పూర్తితోపాటు నీటి పారుదల సౌకర్యం ఉంటే ఎప్పుడైనా ఏడాదిలో 3 నుంచి నాలుగు పంటలు తీసుకునే వీలుంది.
జొన్న..
జొన్న పంటకు నల్లనేల అనుకూలంగా ఉంటుంది. తేలికపాటి ఎర్ర నేల కూడా మంచిదే. ఎర్ర నేల కంటే నల్లనేలలో సాగు చేయడం వల్ల అధిక దిగుబడి పొందవచ్చు. ఎప్పుడైనా వేసుకోవచ్చు.
నువ్వులు..
నీరు నిల్వ ఉండే నేలలు, మురుగు నీరు బయటకి వెళ్లే వీలున్న తేలికైన నేలలు నువ్వుల పంటకు అనుకూలంగా ఉంటాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 వరకు, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నువ్వుల సాగు చేయొచ్చు.
కంది..
కందికి నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు భూములు పనికి రావు. కంది పంటకు నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్ర రేగడి, ఎర్ర చెలక భూములు అనుకూలంగా ఉంటాయి. నల్లరేగడి నేలల్లో కూడా కంది పండుతుంది. కానీ మురుగు నీరు బయటికి పోయే వసతి ఉంటే వేసుకోవచ్చు. జూన్ 15 నుంచి జూలై 15 వరకు పంటను సాగు చేసుకోవచ్చు.
ఆముదం..
ఆముదానికి ఆ నేల, ఈ నేల అనిలేదు. అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసుకోవచ్చు. నీరు ఇంకిపోయే తేలిక నేలల్లో సాగు చేయడం వల్ల అధిక దిగుబడి వస్తుంది. వానకాలంలో వేసుకోవచ్చు. జూన్ మొదటి వారం నుంచి జూలై మొదటి వారంలో విత్తుకుంటే బాగుంటుంది.
వేరుశనగ..
వేరు శనగకు నల్ల నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు. వేరుశనగ సాగు చేయాలంటే ఇసుకతో కూడిన గరప నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. చెలక భూముల్లో సాగు చేయవచ్చు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15, జూన్ నుంచి ఆగస్టు వరకు సాగు చేసి ఏడాదికి రెండు పంటలు తీయొచ్చు.