నల్లగొండ జిల్లాలో ప్రగతి ముఖచిత్రం..
నల్లగొండ ప్రతినిధి, జూన్6(నమస్తే తెలంగాణ) : కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఇందుకోసం కేంద్ర ఆర్థిక సంఘం నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ వస్తున్నది. 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు జనాభా ప్రతిపాదికన గ్రామ పంచాయతీకుల నిధులను విడుదల చేస్తున్నారు. నల్లగొండ జిల్లాకు నెలకు రూ.18కోట్లు, సూర్యాపేట జిల్లాకు నెలకు రూ.12 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాకు నెలకు రూ.8 కోట్ల చొప్పున నిధులు వెచ్చించారు. వీటితో పల్లె వాతావరణంలో కీలకమైన పరిశుభ్రత, పచ్చదనానికి పెద్ద పీట వేశారు. ఈ నిధుల్లోనూ ప్రత్యేకంగా మొక్కలు నాటడం, వాటి పెంచడం కోసం గ్రీన్ బడ్జెట్ పేరుతో 10శాతం కేటాయిస్తున్నారు. గతంలో వీధిదీపాల ఏర్పాటు, తాగునీటి పైప్లైన్ల మరమ్మతులకు కూడా నిధుల కొరత ఉండేది. గ్రామంలో వసూలు చేసే బిల్లులు తప్ప ప్రభుత్వం నుంచి పెద్దగా సహకారం ఉండేది కాదు. కానీ స్వరాష్ట్రంలో వీటన్నింటికీ చెక్ పెడుతూనే శాశ్వత వనరులపై ప్రధానంగా దృష్టి సారించారు. వీటికితోడు అదనంగా ప్రతి గ్రామానికీ ఒక్క ఎకరం స్థలానికి తగ్గకుండా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. పల్లె పార్కుల తరహాలో వీటిని అభివృద్ధి చేస్తున్నారు. మండలానికో బృహత్ ప్రకృతి వనాల పేరుతో పదెకరాల్లో ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
ఇక ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి నిరంతరం మొక్కలను పెంచుతూనే ఉన్నారు. తద్వారా ఎప్పుడంటే అప్పుడు మొక్కలు నాటేందుకు వీలు కలుగుతుంది. ఇవన్నీ కలిపి స్వచ్ఛమైన గాలిని అందించడంలో తోడ్పడనున్నాయి. ఇక గతంలో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారానికి నిర్ధిష్ట స్థలాలు లేకుండే. దీంతో రోడ్ల వెంట, చెరువు శిఖాల్లో శవాలను కాల్చేవారు. కానీ ప్రస్తుతం ప్రతి గ్రామానికీ వైకుంఠధామం ఏర్పాటైంది. ఇక ప్రతి గ్రామానికో డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికీ కొనుగోలు చేసి ఇచ్చిన ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ వల్ల ఎన్నో సత్ఫలితాలు వస్తున్నాయి. గ్రామంలో నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరందిస్తున్నారు. ప్రతి రోజూ చెత్త సేకరణకు కూడా ట్రాలీని వినియోగిస్తున్నారు. గతంలో ఎన్నడూ కనీసం ఓ చెత్త సేకరణ ట్రాలీని కూడా గ్రామాలు ఎరగలేవన్నది కాదనలేని సత్యం. ఇక గ్రామాలు, వార్డుల్లోని కరెంటు సరఫరా వ్యవస్థపైనా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇవన్నీ కూడా గతంలో ఎన్నడూ ఊహించని, ఆశించనివి కావడంతో పల్లె ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పల్లె ప్రకృతి వనం
నల్లగొండ : జిల్లాలో 1425 ఉండగా అందులో ఎకరం -800, 30- గుంటలు 250, 20 గుంటలు-375 ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అన్నీ పూర్తయ్యాయి. గత రెండేళ్లల్లో ఎకరంలో ఉన్న ప్రకృతి వనాలకు రూ.6.27 లక్షలు, 30 గుంటల్లో ఉన్న వనానికి 5.05 లక్షలు, 20 గుంటల్లో ఉన్న వనానికి రూ.4.02 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది.
సూర్యాపేట : 475 గ్రామ పంచాయతీల పరిధిలో 679 పల్లె ప్రకృతి వనాలు మంజూరయ్యాయి. దాదాపు అన్నీ పూర్తయ్యాయి.
యాదాద్రి : జిల్లాలో మొత్తం 421 గ్రామ పంచాయతీలు ఉండగా 650 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. 421 గ్రామ పంచాయతీలతో పాటు 229 ఆవాస గ్రామాల్లోనూ వీటిని పెంచుతున్నారు. ఇవి కాకుండా అన్ని మండల కేంద్రాల్లోనూ మెగా ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు.
నర్సరీ..
నల్లగొండ : ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ చొప్పున మొత్తం 844 గ్రామాల్లో ఏర్పాటు చేసి ప్రతి నర్సరీలో కనీసం 10వేల మొక్కలు పెంచే విధంగా చర్యలు తీసుకున్నారు. అందుకు బ్యాగ్ నుంచి వాచర్, ఇతర నిర్వహణకు ఒక్కో నర్సరీకి రూ.2.50 లక్షలు ఖర్చు చేసింది. ప్రతియేటా కోటి మొక్కలను పెంచుతున్నారు.
సూర్యాపేట : జిల్లాలో మొత్తం 475 నర్సరీలను ఏర్పాటు చేశారు. వీటిని 425 చోట్ల ప్రభుత్వ స్థలాల్లో మరో 50 నర్సరీలను ప్రైవేట్ స్థలాల్లో ఏర్పాటు చేశారు. ఈ నర్సరీల్లో మొత్తం 1.05 కోట్ల మొక్కలను పెంచుతున్నారు.
యాదాద్రి : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ నర్సరీలను పెంచుతున్నారు. వీటిల్లో నిరంతరం ఏడాది పొడవునా 49లక్షల మొక్కలను అందుబాటులో ఉంచుతున్నారు.
డంపింగ్ యార్డు
నల్లగొండ : జిల్లాలోని 844 గ్రామాల్లో డం పింగ్ యార్డులు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు అన్నీ పూర్తి అయ్యాయి. ప్రతి డంపింగ్ యార్డుకు రూ.30వేల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేసింది.
సూర్యాపేట : 475 గ్రామాల్లో ఒక్కో గ్రామానికి ఒకటి చొప్పున మొత్తం 475 డంపింగ్ యార్డు లు మంజూరు చేశారు. అన్ని నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
యాదాద్రి : జిల్లాలోని 421 గ్రామాలకు గానూ 419 చోట్ల వీటి నిర్మాణం పూర్తై అందుబాటులోకి వచ్చాయి. 2 చోట్ల మాత్రమే సాంకేతిక కారణాలతో నిర్మాణం జరుగలేదు.
సెగ్రిగేషన్ షెడ్
నల్లగొండ : చెత్తను వేరు చేసి ఎరువుగా మా ర్చేందుకు ప్రతి డంపింగ్ యార్డులో ఒక సెగ్రిగేషన్ షెడ్ ఏర్పాటు చేశారు. మొత్తం 844 షెడ్లకు గానూ 844 పూర్తయ్యాయి. ప్రతి షెడ్డుకు ప్రభుత్వం రూ.2.50 లక్షలు ఖర్చు చేసింది.
సూర్యాపేట : జిల్లాలోని 475 గ్రామాల్లో ఒక్కో డంపింగ్ యార్డ్తోపాటు సెగ్రిగేషన్ షెడ్ కూడా నిర్మించారు. డంపింగ్ యార్డులతోపాటు వీటిని కూడా పూర్తి చేశారు.
యాదాద్రి : జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలకు గాను 419 చోట్ల సెగ్రిగేషన్ షెడ్స్ నిర్మించారు. వీటిని స్థానికంగా ఉన్న పరిస్థితుల మేరకు వినియోగంలోకి తెస్తున్నారు.
గ్రీన్ బడ్జెట్..
నల్లగొండ : మొక్కలను పెంచి సంరక్షించడం కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం విడుదల చేస్తున్న పల్లె ప్రగతి నిధుల నుంచి 10శాతం గ్రీన్ బడ్జెట్‌గా నిర్ణయించారు. వీటిని కేవలం పచ్చదనం పెంపుకోసమే వినియోగించాల్సి ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.186 కోట్ల బడ్జెట్లో రూ.18.6 కోట్లు గ్రీన్‌బడ్జెట్ కింద కేటాయించారు.
సూర్యాపేట : జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.122.20 కోట్ల బడ్జెట్ విడుదల కాగా ఇందులో రూ.12.22 కోట్లను గ్రీన్ బడ్జెట్‌గా ఖర్చు చేశారు.
యాదాద్రి : జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.80.10 కోట్లు పల్లెలకు నిధులు విడుదల కాగా ఇందులో 8.01 కోట్లను గ్రీన్బడ్జెట్గా కేటాయిస్తూ పచ్చదనం పెంపుకోసం ఖర్చు చేశారు.
వైకుంఠధామాలు
నల్లగొండ : జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వైకుంఠధామం చొప్పున మొత్తం 844 నిర్మాణాలకు మంజూరు ఇచ్చారు. ఒక్కో వైకుంఠధామానికి ప్రభుత్వం రూ.12.60 లక్షలు కేటాయించింది. ఇప్పటి వరకు అన్నీ పూర్తయ్యాయి.
సూర్యాపేట : 475 గ్రామ పంచాయతీలకు 475 వైకుంఠధామాల నిర్మాణానికి మంజూరు ఇచ్చారు. ఇందులో వంద శాతం పూర్తయ్యాయి.
యాదాద్రి : జిల్లాలోని మొత్తం 421 గ్రామ పంచాయతీలకు 418 గ్రామాల్లో వైకుంఠధామా ల నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. వీటిలో ఇప్పటికే చాలా వరకు వినియోగంలోకి రాగా మిగతావాటిని ప్రస్తుత పల్లె ప్రగతిలో ప్రారంభిస్తున్నారు.