నేరేడుచర్ల, జూన్ 6 : నట్టల బెడద సర్వసాధారణం. నేలకు దగ్గరగా మేత మేయడం వల్ల ఆ సమస్య ఉత్పన్నమవుతున్నది. మేత లభ్యం కానప్పుడు, పోషకాల లోపం ఏర్పడినప్పుడు, వర్షాకాలం, అనావృష్టి సందర్భాలు, అంటు వ్యాధులు ప్రబలిన సమయాల్లో ఈ పరాన్న జీవుల బెడద అధికంగా ఉంటుంది. నట్టల్లో ప్రధానంగా ఏలిక పాములు, బద్దె పరుగులు, జలగలు అనే మూడు రకాలున్నాయి. కొన్ని సార్లు వేర్వేరు రకాలు కలిపి ఉంటాయి. ఇవి శరీరం, కాలేయం, ఊపిరితిత్తులు, పేగులు, జీర్ణాశయంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటాయి. నట్టల లక్షణాలు, నివారణ చర్యల గురించి పశు సంవర్ధక శాఖ అధికారులు అందిస్తున్న సూచనలు.
ఈ నెల 8 నుంచి 14 వరకు సూర్యాపేట జిల్లాలో ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 91,900 గొర్రెలు, మేకలు ఉండగా వాటికి నట్టల నివారణ మందులు తాగించడానికి 56 బృందాలను ఏర్పాటు చేశారు.
మందులు తాగించే ముందు జాగ్రత్తలు
పేడ నమూనాలను సేకరించి పరిశీలించాలి. అవసరమైతే పోస్ట్మార్టం చేయించి ఫలితాల ఆధారంగా మందులు ఎంపిక చేసుకోవాలి.
మందుల ప్రభావం ఎక్కువగా ఉండటానికి జీవాలను ముందు రోజు మేత లేకుండా లేదా తక్కువ మేతతో ఉంచాలి.
పశువైద్యుడి సలహా మేరకు మందుల మోతాదును చూసుకోవాలి.
వాతావరణ పరిస్థితులు, మేత వనరులు, పరాన్న జీవుల ఉధృతి దృష్ట్యా ఏడాదిలో మూడుసార్లు నట్టల నివారణ మందులు తాగించాలి.
మందులు.. ప్రయోజనాలు
జీవాలకు అందించిన పోషకాలు సరైన ఎదుగుదలకు ఉపయోగపడి ఆరోగ్యంగా, బలంగా, చురుకుగా ఉంటాయి. అధిక మాంసం ఉత్పత్తి అవుతుంది.
వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇతర వ్యాధులు సక్రమించే అవకాశాలు తగ్గుతాయి.
పునరుత్పత్తి శక్తి పెరుగుతుంది. జీవాలు త్వరగా ఎదకు వస్తాయి. చూడి కట్టడం పెరుగుతుంది. ఈతల మధ్య కాలం తగ్గుతుంది. మంద వేగంగా వృద్ధి చెందుతుంది.
చూడి ఉన్న జీవాలకు నట్టలను నివారించడం వల్ల గొర్రెపిల్లలు ఆరోగ్యంగా అధిక బరువుతో పుడతాయి.
ఏ లక్షణాలు ఉంటాయంటే ?
నట్టలు జీవాలలో పోషక పదార్థ్ధాలను, రక్తాన్ని స్వీకరించి రక్తహీనతకు గురిచేస్తాయి.
తరచూ విరేచనాలు కావడం, ఆకలిలేమి, పొట్ట కిందికి జారి ఉండటం, దవడల మధ్య నీరు చేరడం తదితర
లక్షణాలు కనిపిస్తాయి.
ఎంత మేసినా జీవాలు బక్కచిక్కి అనారోగ్యం పాలవుతాయి.
వ్యాధి నిరోధక శక్తి తగ్గి నీరసించి పోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర వ్యాధులు వచ్చే అవకాశం అధికం.
నివారణ చర్యలు
జీవాలను మేపేటప్పుడు ఒకే ప్రదేశంలో కాకుండా 4నుంచి 5 రోజులకు ఒక సారి ప్రాంతాన్ని మార్చుతూ ఉండాలి. తేమ ఉన్న ప్రదేశాల్లో మేపకూడదు.
జలగ వ్యాధి కలిగించే నత్తలను నిర్మూలించాలి.
నట్టల నివారణ మందులను తప్పనిసరిగా క్రమపద్ధతిలో తాగించాలి.
నివారణ మందు తాగించాలి
జీవాల్లో నట్టల నివారణకు పశు సంవర్ధక శాఖ ప్రతి ఏడాది ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నది. ఇందుకు మందుగానే వివిధ ప్రాంతాల నుంచి జీవాల పేడ నమూనాలను సేకరించి పరిశీలించి వాటి ఆధారంగా అవసరమైన నట్టల నివారణ మందులు ఎంపిక చేస్తాం.
– బాణోతు రవి, పశు వైద్యాధికారి, పెంచికల్దిన్నె