కనగల్, జూన్ 6 : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దర్వేశిపురంలో ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా దర్వేశిపురం ఆలయం నుంచి సాగర్ పీడబ్ల్యూ రోడ్డు వరకు రూ.3.66కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు రోడ్డు పనులు, రూ.28లక్షలతో చేపట్టిన దర్వేశిపురం పాఠశాల మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిని చేపట్టినట్లు తెలిపారు. నేడు గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, హరితహారం చెట్లతో పరిశుభ్రంగా తయారయ్యాయన్నారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
పల్లె ప్రగతితో అభివృద్ధికి బాటలు
పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధికి బాటలు వేసినట్లు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలకు మహర్దశ పట్టిందన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో గుణాత్మక మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎవ్వరూ సాటి రాలేరని అన్నారు. విద్య, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.7,238 కోట్లతో సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. విడుతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల పాఠశాలలను బాగు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, పీడీ కాళిందిని, జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డీఈఓ భిక్షపతి, ఎంఈఓ రాములు, తాసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎంపీడీఓ సోమసుందర్‌రెడ్డి, ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్, వైస్ ఎంపీపీ రాంగిరి శ్రీధర్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, ఆలయ చైర్మన్ నల్లబోతు యాదగిరి, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు మర్రి రేణుక, గ్రామ సర్పంచ్ అల్గుబెల్లి పూలమ్మ, ఎంపీటీసీ నకిరేకంటి శైలజ పాల్గొన్నారు.