2001.. జూన్ 2.. చైతన్యానికి ప్రతీక అయిన నల్లగొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్ వేదిక.. ఒక బక్కపలుచని మనిషి సభా వేదికపైకి చేరుకున్నారు. దశాబ్దాలుగా ఈ నేలకు జరుగుతున్న అన్యాయాన్ని పక్కా తెలంగాణ యాసలో ఎండగడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం అవసరమేందో, వస్తే ఈ ప్రాంతం ఎలా మారుతుందో కండ్లకు కడుతూ అలిసిన బతుకుల్లో ఆశలు నింపే ప్రయత్నం చేశారు. ఆయనే కేసీఆర్. అప్పటికి టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుని సరిగ్గా మూడు నెలలు మాత్రమే. అయినా సభ చప్పుట్లు, జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. ఉమ్మడి జిల్లా ఉద్యమ జవసత్వాలను నింపుకొని రగల్ జెండా ఎత్తుకున్నది.
ఉద్యమ నేతగా కేసీఆర్ చెప్పిన మాటలన్నీ నేడు అక్షర సత్యాలై కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. త్యాగాల తొవ్వలో కష్టాల కడలిని దాటుకుని ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. కృష్ణా, గోదావరి పరవళ్లతో ఉమ్మడి నల్లగొండ జిల్లా సిరుల మాగాణమైంది. చెప్పినట్టే మూసీ మురుగునీటి నుంచి విముక్తి లభించింది. ఫ్లోరైడ్ పీడ విరుగడైంది. పాలన చేరువైంది. నీళ్లు, నిధులు, నియామకాలు, విద్య, వైద్యంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి తెలంగాణ బిడ్డ మదిలో ఆ జ్ఞాపకాలన్నీ కదలాడుతున్నాయి. ఆవిర్భావ వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు సబ్బండ వర్గాలు సమాయత్తం అవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు కాంతులీనుతున్నాయి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి గురువారం ఉదయం కలెక్టరేట్లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
నాటి పరిస్థితి : తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నల్లగొండ జిల్లా.. మొన్నటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో పోరు బాటలో నడిచిన నీలగిరి.. నిన్నటి తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలోనూ ప్రాధాన పాత్ర పోషించింది. అలాంటి జిల్లాను ఫ్లోరైడ్ సమస్య పట్టి పీడించింది. మూసీ కంపు కొట్టింది. ఆధునిక హైటెక్ యుగంలో ఆడపిల్లలను అంగట్లో అమ్మేశారు. దుస్తులు నేసే నేతన్న ఆకలి చావులు ఆగ లేదు. పక్కనే కృష్ణమ్మ పారుతున్నా గుక్కెడు మంచినీరు గొంతులోకి వచ్చే పరిస్థితి లేదు. ఫ్లోరైడ్ రక్కసి లక్షలాది యువత భవిష్యత్తును అంధకారం చేసింది. ఎడమ కాల్వకు సాగర్ నీరు అరకొరగా రావటంతో.. చివరి భూములకు నీరందక బీడుగా మారాయి. ఎత్తిపోతల పథకాలు పెట్టినా నీళ్లు ఎత్తిపోయకపోవడంతో చివరికి కన్నీళ్లే మిగిలాయి. ఇలా ఏ రంగం చూసినా ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు సాక్షాత్కరించేది. నల్లగొండ అంటేనే వెనుకబాటు జిల్లాగా ప్రముఖంగా చర్చకు వచ్చేది. అందుకే ‘మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలు మాకే దక్కాలంటూ’ సాగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నల్లగొండ జిల్లా ఉవ్వెత్తున ఎగిసిపడింది. గల్లీగల్లీ నుంచి మొదలు జిల్లా వరకు ఉద్యమంలో కదంతొక్కుతూ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించింది. 2002 ఏప్రిల్ 2న నల్లగొండ గడ్డపై జరిగిన టీఆర్ఎస్ పార్టీ తొలి ప్లీనరీ వేదికగా ఉద్యమ నేత కేసీఆర్ చేసిన సింహగర్జన ఉద్యమ చరిత్రలో ఓ మైలు రాయి. ఇక అక్కడి నుంచి కేసీఆర్ ఏనాడూ వెనుదిరిగి చూసింది లేదు.
నేటి పరిస్థితి : 2014 జూన్ 2న స్వరాష్ట్రం తెలంగాణ సిద్ధించింది. ఘనంగా స్వాగతం పలుకుతూ అంబరాన్నంటే వేడుకలకు ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న నల్లగొండ వేదికైంది. ఇక అప్పటినుంచి మొదలైన ఉద్యమనేత కేసీఆర్ పాలనలో రాష్ట్రంతో పాటు జిల్లాలోనూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. అభివృద్ధిలో కీలకమైన సాగునీరు, తాగునీరు, కరెంటు సరఫరా, వ్యవసాయాభివృద్ధి, విద్యావైద్యం, పరిపాలన వికేంద్రీకరణ, రవాణా వ్యవస్థ ఇలా అనేక రంగాల్లో సమూలమైన మార్పులు చోటుచేసుకున్నాయి. వీటికి తోడూ ఎవరూ ఊహించని విధంగా సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యాయి. పేదల జీవితాలకు ఆసరాగా ఎన్నో సంక్షేమ పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాధాన్యత ప్రకారం ఒక్కో సమస్యకు పరిష్కారం చూపుతూ ఉమ్మడి జిల్లాను అభివృద్ధిని అగ్రభాగాన నిలిపేందుకు వందల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ఒక్క వ్యవసాయంలోనే 13లక్షల ఎకరాల సాగు భూమి నుంచి 22లక్షల ఎకరాలకు పెరిగింది. ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా లేని జిల్లాగా అవతరించింది. రైతన్నల ఆత్మహత్యలకు చెక్ పడింది. ఇలా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధ్ది దిశగా దూసుకుపోతున్నది.
వ్యవసాయంలో ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధికంగా బోర్లు, బావులు ఉన్న జిల్లాలో నేడు స్వరాష్ట్రంలో 24గంటల ఉచిత కరెంటుతో కష్టాలన్నీ తొలిగిపోయాయి. దీంతో వ్యవసాయంలో సాగుభూమి గణనీయంగా 13లక్షల ఎకరాల నుంచి 22 లక్షలకు పెరిగింది. అందుకు అనుగుణంగా వరి, పత్తి పంటల సాగులో రాష్ట్రంలోనే నల్లగొండది అగ్రస్థానం. ధాన్యం దిగుబడుల్లోనూ ప్రథమ స్థానమే. సాగునీరు, ఉచిత కరెంటుకు తోడు రైతుబంధు, రైతుబీమాలు లాంటి పథకాలతో వ్యవసాయంలో అగ్రగామి జిల్లాగా రూపుదిద్దుకుంది. దామరచర్ల మండలం పరిధిలో 4400 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ జిల్లా అభివృద్ధికే తలమానికంగా మారనుంది. వచ్చే రెండేళ్లల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలోని అభివృద్ధిని ఓ సారి పరిశీలిస్తే ఎన్నో కీలకమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సాగునీటి విషయంలో ఒక్క నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు మినహా మిగతా ప్రాంతాల్లో పూర్తిగా భీడుభూములే దర్శనం ఇచ్చేవి. దీంతో ప్రభుత్వం దీనికి అధిక ప్రాధాన్యతనిస్తూ పలు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు అనుసంధానం చేస్తూ సమృద్ధిగా సాగునీటిని అందిస్తున్నది. సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లో దశాబ్దాల కలగా మారిన ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు తరలించారు. ఇక ఇదే సమయంలో సాగర్ ఎడమకాల్వ ఆయకట్టులోనూ టెయిలెండ్ భూములకు సైతం సాగునీరు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ కొనసాగుతున్నది. సాగర్‌లోని నీటివాటా వాడుకోవడంలోనూ నిక్కచ్చిగా వ్యవహరిస్తూ రెండు పంటలకు నీరు అందిస్తున్నారు. ఇక ఇటీవలే ఎడమకాల్వకు దిగువన, కృష్ణానదికి ఎగువన మిగిలి ఉన్న బీడుభూములన్నింటికీ సాగునీరు అందించేందుకు 2,500 కోట్ల రూపాయలతో ఎత్తిపోతకాల పనులు కొనసాగుతున్నాయి. ఇక ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉంటూ వచ్చిన ఎస్ఎల్బీసీ వరద కాల్వను పూర్తి చేసి 80వేల ఎకరాలకు సాగనీటిని ప్రతి సీజన్లోనూ అందిస్తున్నారు. ఇక ఏఎంఆర్పీ ద్వారాను నిరంతరం నీటిని విడుదల చేస్తూ చెరువులను నింపుతున్నారు. వీటితో పాటు ఎలాంటి సాగునీటి వసతి లేని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల కోసం డిండి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉంది. దీన్ని కూడా త్వరలోనే పూర్తి చేసే దిశగా పనులు కొనసాగిస్తున్నారు. ఇవి కాకుండా ఎక్కడికక్కేడే వాన నీటి నిల్వల కోసం వందల కోట్లతో చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇలా వచ్చే రెండుమూడేండ్లలో ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వడంతో తాగునీటిలో ఫ్లోరైడ్ లేకుండా పోయింది. దీంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించిన నివేదిక ప్రకారం కొత్తగా ఒక్క కేసు కూడా లేకుండా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా అవతరించింది. ఇది తాగునీటి విషయంలో చారిత్రక మార్పుగా భావించవచ్చు.
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టాన్ని ఎనిమిదేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి రోల్ మోడల్‌గా నిలిపారు. రాష్ట్రం ఏర్పడితే ఉండనే ఉండదు అనుకున్న విద్యుత్ పోనే పోదు అనే వరకు చేరింది. వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయి. విద్య, వైద్య రంగంలో ఎంతో ప్రగతి సాధించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిదర్శనం. వృద్ధి రేటులో అద్భుత ఫలితాలు సాధించాం.
హాలియా, జూన్1: నాగార్జున సాగర్ కుడి ఎడమ కాల్వపై ఉన్న లిఫ్ట్‌ల నిర్వహణపై నాటి సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంత రైతాంగంపై వివక్ష చూపారు. దాంతో నాటి ఉద్యమ నేత కేసీఆర్ 2003లో లిఫ్ట్‌లను ప్రభుత్వమే నిర్వహించాలని కోదాడ నుంచి హాలియా వరకు 100 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం హాలియాలో బహిరంగ సభలో నాటి పాలకుల కుట్రలను ప్రజలకు వివరించారు.
2006లో టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కేసీఆర్ 2006లో హాలియాలో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్ వచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో సీమాంధ్ర పాలకులు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. ఆ సమయంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
ఉమ్మడి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వమంటేనే ఏండ్లు గడిచిపోయాయి. కానీ అలాంటిది నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు వేర్వేరుగా మెడికల్ కాలేజీలు వచ్చాయి. వచ్చే ఏడాది యాదాద్రి జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. దీంతో మూడు జిల్లాల్లోనూ వీటికి అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక కేసీఆర్ కిట్ లాంటి పథకాలు ప్రభుత్వవైద్యంపై మరింత విశ్వాసం కలిగేలా చేశాయి. గురుకులాలు, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు పెద్దసంఖ్యలో నెలకొల్పారు. వీటిలోపాటు ఇంటర్, డిగ్రీ వరకు గురుకులాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మైనార్టీ గురుకులాల సంఖ్య భారీగా పెంచారు. మధ్యాహ్నభోజనంతోపాటు హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేస్తూ నాణ్యమైన భోజనం అందజేస్తున్నారు.
పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి జిల్లాను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలుగా విభజించారు. ఇదే సమయంలో కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీలను ఏర్పాటు చేశారు. ఎన్నో కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. గిరిజన తండాలన్నీ పంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయి. వీటిని విభజించడమే కాకుండా రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రతినెలా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో కోట్లాది రూపాయలను విడుదల చేస్తూ పల్లెల్లను, పట్టణాలను తీర్చిదిద్దుతున్నారు. ఇక అభివృద్ధి పథకాలతోపాటు సంక్షేమానికి పెద్ద పీట వేశారు. వృత్తుల వారీగా పలు పథకాలను అమలు చేస్తున్నారు. స్వరాష్ట్రంలో స్పష్టమైన మార్పును గమనిస్తూ, ప్రగతి ఫలాలను ఆస్వాదిస్తున్న వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని అభినందిస్తున్నారు.
2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి అనతికాలంలోనే నల్లగొండలో 2001జూన్ 2న ఎన్జీ కళాశాల ఆవరణలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ జిల్లా వెనుకబాటుతనానికి కారణాలను వివరించారు. సమైక్య పాలకుల వివక్ష రూపాలను విడమర్చి చెప్పారు. కృష్ణాజలాల్లో అన్యాయాన్ని, ఫ్లోరైడ్ భూతానికి కారణాన్ని, భీడుభూముల భాగోతాన్ని, వలస తీరును ఇలా అనేక అంశాలపై స్పష్టమైన వివరణలతో తన తొట్టతొలి ప్రసంగాన్ని జిల్లా ప్రజలను ఉద్యమబాట పట్టించేలా కొనసాగించారు. కానీ సరిగ్గా 13 ఏండ్ల తర్వాత 2014లో స్వరాష్ట్రం సాధించుకుని అభివృద్ధి పథంలో పయనింపచేయడం మొదలైంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. ఉద్యమ తొలి సభలో కేసీఆర్ చెప్పిన అన్ని అంశాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కొనసాగుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో రైతులంతా అరిగోస పడ్డరు. వ్యవసాయ పనులు మొదలు పెట్టాలంటే పెట్టుబడి పైసల కోసం వడ్డీ వ్యాపారుల ఇంటి చుట్టూ తిరగాల్సి వచ్చేది. వాళ్లు ఇష్టంవచ్చిన వడ్డీ చెప్పి ఈ టైముకే డబ్బులు ఇవ్వాలని కండిషన్ పెట్టేవారు. రైతులు గత్యంతరం లేని పరిస్థితిలో పైసలు తెచ్చుకొని పనులు మొదలు పెట్టేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులను బాధలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిండు. నిజంగా ఈ పథకం రైతుల బతుకులకు భరోసా కలిగించింది. ఎకరానికి ఏడాదికి పది వేల రూపాయలు ఇవ్వడం వల్ల విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుని అనుకున్న టైముకు నాట్లు వేసుకుంటున్నరు. అప్పులు, వడ్డీల బాధలు తప్పడంతో రైతులు సంతోషంగా ఉంటున్నరు. 24 గంటల విద్యుత్‌తో రైతుల కష్టాలు తీరినయి. రైతుల కుటుంబాలకు భరోసాగా సీఎం కేసీఆర్ రైతుబీమా కూడా కల్పించిండు. రాష్ట్రం రాకుండా ఇవన్నీ వచ్చేవి కావు.
– యల్లావుల అంజయ్య, రైతు, కీతవారిగూడెం, గరిడేపల్లి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు తీసుకొచ్చిండు. రుణ మాఫీ చేసి రైతు బంధు, రైతుబీమా అమలు చేస్తున్నడు. నీటి తీరు రద్దు చేసిండు. సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇబ్బందులు తీరినయి. మిషన్ కాకతీయ పథకం వల్ల చెరువులు నిండి భూగర్భ జలాలు బాగా పెరిగాయి. నేడు ఎక్కడా చూసినా పంటలు పుష్కలంగా పడుతున్నాయి. ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండడంతో వ్యవసాయం పండుగలా మారింది. దేశానికి సీఎం కేసీఆర్ ఆదర్శ నాయకుడు.
-శ్రీనివాస రావు, రైతు, జప్తి వీరప్పగూడెం, మిర్యాలగూడ మండలం