మిర్యాలగూడ, జూన్ 1 : ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుంచి రూ.15 లక్షల విలువ చేసే 24 బైక్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు మిర్యాలగూడ టూటౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడేనికి చెందిన వేమూరి కృష్ణ అలియాస్ చేకూరు శ్రీకాంత్‌చౌదరి చిన్నతనం నుంచి చోరీలకు అలవాటు పడ్డాడు.
బుధవారం హనుమాన్‌పేట సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా యూనీకాన్ బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి ప్రశ్నిస్తుండగా పారిపోయే ప్రయత్నం చేశాడు. దాంతో పట్టుకుని విచారణ చేయగా బైక్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. గతంలో దొంగతనం కేసులో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ఇటీవల 22 సెప్టెంబర్ 2021న ఖమ్మం జిల్లా జైలు నుంచి విడుదలై వచ్చి మిర్యాలగూడ చుట్టు పక్కల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. మిర్యాలగూడ టూటౌన్ పరిధిలో 5, వన్‌టౌన్‌లో 4, మిర్యాలగూడ రూరల్‌లో 2 , సూర్యాపేట టౌన్లో 5 , ఖమ్మం టౌన్ పరిధిలో 8 కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితుడు పలు చోట్ల దొంగతనం చేసిన 24 బైక్‌లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కేసును చేధించిన డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐ సురేశ్,ఎస్ఐ సురేశ్‌కుమార్, సైదిరెడ్డి, సిబ్బంది వెంకటేశ్వర్లు, రవి, రామకృష్ణను ఎస్పీ అభినందించారు.