హిట్ 2, లక్కీభాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మీనాక్షి చౌదరి బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా రాజ్ శాండిల్య దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భాగమ్ భాగ్ 2’లో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా ఎంపికైంది. గతంలో వచ్చిన సూపర్‌హిట్ కామెడీ మూవీ ‘భాగమ్ భాగ్’కు ఈ సినిమా సీక్వెల్ కావటం విశేషం.
తొలి భాగం తరహాలోనే పక్కా కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనున్నదని, మీనాక్షి కెరీర్లో ఓ మైలురాయిగా ఈ సినిమా నిలువనున్నదని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభించి, ఈ ఏడాది చివరిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మనోజ్ బాజ్‌పాయ్, అయేషాఖాన్ ఇందులో కీలక పాత్రధారులు.