మిర్యాలగూడ టౌన్, ఏప్రిల్ 19: లక్ష్యాన్ని ఎంచుకుని పట్టుదలతో సాధించాలి. లక్ష్య సాధనలో ప్రయత్న లోపం ఉండొద్దు. విజయ సోపానాలను ఎలా నిర్మించుకుంటున్నామనేదే ముఖ్యం. అందుకు తగ్గ ప్రణాళిక, వ్యూహం, సరైన పరిసరాలను ఎంచుకోవాలి. పాఠశాల స్థాయి నుంచే ఓ లక్ష్యాన్ని ఏర్పర్చుకుంటే లక్ష్యసాధన సులభం అనడానికి త్రిపురారం మండలం నీలయ్యగూడేనికి చెందిన పూల కావ్య ఉదాహరణగా నిలుస్తున్నది. కళాశాల స్థాయిలోనే పోలీసులను చూసి ప్రభావితం అయిన ఆ యువతి డిగ్రీ పూర్తయిన వెంటనే తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ సివిల్స్ సాధించడమే తన తదుపరి లక్ష్యం అంటున్న కావ్య సక్సెస్ స్టోరీ ఇది.
నీలయ్యగూడేనికి చెందిన పూల సుధాకర్, కృష్ణకుమారి దంపతులకు రెండో కుమార్తె అయిన కావ్య 7వ తరగతి వరకు త్రిపురారం మండలం ముకుందాపురంలో చదివింది. తండ్రి డీలర్షాపు నడుపుతూ మిర్యాలగూడలోని ఓ అద్దె గదిలో ఉంటూ పిల్లలను చదివించారు. పదో తరగతి వరకు ఆదర్శస్కూల్, ఇంటర్మీడియట్ గౌతమి కళాశాల, డిగ్రీ నాగార్జున కళాశాలలో పూర్తి చేసింది. మహిళలపై వేధింపులు, అమ్మాయిలంటే చులకన, అభద్రతా భావం తనను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఎలాగైనా పోలీస్ అవ్వాలనే లక్ష్యంతో చదువును కొనసాగించింది. ఈ క్రమంలో కళాశాల స్థాయిలో నిర్వహించే ప్రతి సెమినార్లో పాల్గొని మాట్లాడేది. అదేవిధంగా తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో చదువుతో వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభను చాటి బహుమతులు సాధించేది.
తొలి ప్రయత్నంలోనే..
డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఎస్ఐ జాబ్‌ను లక్ష్యంగా ఎంచుకుని ప్రిపరేషన్ కొనసాగించింది. ప్రణాళికను రూపొందించుకుని లక్ష్యసాధన దిశగా అడుగులు వేసింది. రోజూ ఉదయాన్నే ఎన్నెస్పీ క్యాంపు గ్రౌండ్‌కు వెళ్లి వ్యాయామం, రన్నింగ్, యోగా చేసి 7.30గంటల వరకు ఇంటికి వచ్చి, తిరిగి 9 గంటలకు గ్రంథాలయానికి వెళ్లి సాయంత్రం వరకూ పుస్తకాలు తిరగేసేది. మళ్లీ సాయంత్రం గ్రౌండ్‌కు వెళ్లి వ్యాయామం చేసి రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత 11 గంటల వరకు చదువును సాగించేది. గ్రంథాలయంలో రెండు గంటలకో సబ్జెక్ట్‌ను ఎంచుకుని సాయంత్రం వరకు మూడు సబ్జెక్టులను పూర్తి చేసేది. మూడు నెలల తర్వాత మిర్యాలగూడలో ఎన్బీఆర్ ఫౌండేషన్ ఇచ్చిన ఉచిత కోచింగ్‌ను సైతం సద్వినియోగం చేసుకుంది. తన తొలి ప్రయత్నంలోనే ఎస్ఐగా ఎంపికైంది.
గాంధీనగర్ ఎస్ఐగా కావ్య…
చాదర్‌ఘాట్, వికారాబాద్ స్టేషన్లలో శిక్షణ పూర్తి చేసిన కావ్య మొదటి పోస్టింగ్ సికింద్రాబాద్‌లోని గాంధీనగర్‌లో చేపట్టారు. రోజూ సహచర సిబ్బందితో కలిసి పలు సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. పురుషులకు దీటుగా రాత్రి వేళల్లోనూ గస్తీ చేపడుతూ శాంతిభద్రతల పర్యవేక్షణలో తన మార్క్ చూపిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకున్నారు.
రాష్ట్ర సాధనతోనే పుష్కలమైన అవకాశాలు…
తెలంగాణ రాకపోయి ఉంటే ఆంధ్రా పాలకుల వివక్ష కొనసాగేది. రాష్ట్ర సాధనతోనే ఉద్యోగావకాశాలు పెరిగాయి. ప్రస్తుతం తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే ఆదర్శంగా నిలువడానికి సీఎం కేసీఆర్ విజనే కారణం. తెలంగాణ వచ్చిన తర్వాతనే యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. 2018నోటిఫికేషన్లో ఎస్ఐగా ఎంపికయ్యాను. ప్రభుత్వం మరోసారి పోలీస్ ఉద్యోగ నియామకాలకు భారీ నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నందున ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. అనవసర కాలయాపన చేయకుండా ప్రిపరేషన్‌ను మొదలుపెట్టాలి. ఒకే సబ్జెక్ట్‌పై ఎక్కువ సేపు ఏకాగ్రత ఉంచలేము. అందుకే సబ్జెక్ట్ పరంగా పుస్తకాలను ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి. ఎన్ని పేజీలు చదివామన్నది ముఖ్యం కాదు. ఎంత వరకు అర్థమైందనేదే ఇంపార్టెంట్. క్రమం తప్పకుండా న్యూస్ పేపర్లను కూడా ఫాలో కావాలి. పేపర్ నాలెడ్జ్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. సివిల్స్ సాధించాలన్నదే నా తదుపరి లక్ష్యం.
– పూల కావ్య, ఎస్ఐ